Telugu Global
Telangana

మీడియా కాదు 'మోడీ'యా.. ఎప్పుడూ భజనేనా..?

తాను రోజుకి 13 న్యూస్ పేపర్లు చదువుతానని చెప్పారు కేటీఆర్. మీడియా సంస్థలకంటే జర్నలిస్ట్ లే గొప్పవారని, మీడియాలో పనిచేసే కలం వీరుల పనితనం గొప్పదని కొనియాడారు.

మీడియా కాదు మోడీయా.. ఎప్పుడూ భజనేనా..?
X

భారత్ లో మీడియా 'మోడీయా'గా మారిపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. ఈరోజుల్లో వార్తలు చూస్తే.. ఏది వార్తో, ఏది వాస్తవమో అర్థం కావడం లేదన్నారు. తాను పాత్రికేయుల్ని ఏమీ అనడం లేదని, గతంలో లాగా వార్తల్లో నైతిక బలం లేదని పేర్కొన్నారు కేటీఆర్. దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం పెరుగుతున్నా.. వాటిపై వార్తలు రావని చెప్పారు. కానీ.. ఏం తినాలి, ఏ దుస్తులు వేసుకోవాలి అనేవాటిపై మాత్రం వార్తలొస్తాయన్నారు. ''అయితే జుమ్లా మాటలు, లేకపోతే హమ్లా?'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఈ ఘనతలు వాస్తవాలు కావా..? వార్తలు కావా..?

ఎనిమిదేళ్లుగా మన్‌కీ బాత్ తప్ప.. మోదీ మీడియాతో మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు కేటీఆర్. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ ఇక్కడ తయారవుతోందని, ఐటీలో మేటి కంపెనీలు హైదరాబాద్‌ లో ఉన్నాయని.. ఇలాంటి వార్తలు ఎందుకు రాయరని ప్రశ్నించారు. మన విషయం మనం చెప్పుకుంటే తప్పేంటని అన్నారు. ఒకవేళ తాము తప్పు చేస్తే చీల్చి చెండాడండని అన్నారు. ఎప్పుడూ ఐటీ, ఈడీ దాడులే వార్తలా..? మంచి చేసినప్పుడు ఎందుకు చూపించరు అంటూ నిలదీశారు కేటీఆర్. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్‌ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంస్థలకంటే జర్నలిస్ట్ లే గొప్ప..

తాను రోజుకి 13 న్యూస్ పేపర్లు చదువుతానని చెప్పారు కేటీఆర్. మీడియా సంస్థలకంటే జర్నలిస్ట్ లే గొప్పవారని, మీడియాలో పనిచేసే కలం వీరుల పనితనం గొప్పదని కొనియాడారు. నిజాం కాలంలో షోయబ్ ఉల్లాఖన్, గోల్కొండ పత్రిక నడిపిన సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల్లో నైతిక బలం ఉందన్నారు. టీఆర్ఎస్ స్థాపించిన సమయంలో ఏ మీడియా యాజమాన్యం సపోర్ట్ తమకు లేదని, కానీ మీడియాలో ఉన్న జర్నలిస్టులే తమకు సపోర్ట్ గా నిలబడ్డారన చెప్పారు కేటీఆర్. అప్పుడు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి, గౌరవించుకున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని జర్నలిస్ట్ సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు కేటీఆర్. సంక్రాంతి తర్వాత తెలంగాణలో మీడియా అకాడమీ బిల్డింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.

First Published:  12 Nov 2022 10:00 AM GMT
Next Story