Telugu Global
Telangana

బండి సంజయ్.. ఆ మెగా పవర్ లూమ్ క్లస్టర్ సంగతేంటో ముందు చూడు : కేటీఆర్

''తన పార్లమెంటు (కరీంనగర్) పరిధిలోని సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ శాంక్షన్ కూడా చేయించుకోలేక పోతున్నాడు. నేతన్నల కోసం దాన్ని ఇంత వరకు ఏర్పాటు చేయించలేక పోయాడు.

బండి సంజయ్.. ఆ మెగా పవర్ లూమ్ క్లస్టర్ సంగతేంటో ముందు చూడు : కేటీఆర్
X

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తొలిసారి చేనేత కార్మికులకు బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 'నేతన్నకు బీమా పథకం' అందిస్తున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చేనేత, పవర్ లూమ్ కార్మికులకు ఈ బీమా పథకం అమలు కానుంది. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.

'ప్రగతిభవన్‌లో నిద్రపోతున్న అందగాడు.. ఇప్పుడు లేచి చేనేత బీమా ప్రకటించాడు. రాష్ట్ర బీజేపీ ఏన్నాళ్లుగానో ఈ పథకం అమలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఏడాది క్రితం ఇలాగే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి ట్విట్టర్ టిల్లు ప్రకటించాడు. ఈ ఆలస్యానికి కారణం ఎవరు. చేనేత కార్మిక బాధిత కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు' అంటూ బండి ట్వీట్ చేశారు.

బండి చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ''తన పార్లమెంటు (కరీంనగర్) పరిధిలోని సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ శాంక్షన్ కూడా చేయించుకోలేక పోతున్నాడు. నేతన్నల కోసం దాన్ని ఇంత వరకు ఏర్పాటు చేయించలేక పోయాడు. అలాంటి ఎంపీ ఇలాంటి జోకులు మాత్రం భలే వేస్తాడు. బండి సంజయ్ కుమార్, తెలంగాణలోని నేతన్నలకు ఎన్టీయే ప్రభుత్వం గత 8 ఏళ్లలో ఏం చేసిందో చెప్పవచ్చు కదా. లేదంటే కరీంనగర్ ఎంపీగా నువ్వేం చేశావో అదైనా చెప్పు'' అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

కాగా, ఎన్డీయే ప్రభుత్వం సీపీసీడీఎస్ పథకం ద్వారా పలు ప్రాంతాలకు పవర్ లూమ్ క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేతకు హబ్‌గా ఉన్న సిరిసిల్లకు కూడా మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మంత్రి కేటీఆర్ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా తమిళనాడు లోని ఈరోడ్, మహారాష్ట్రలోని భీవండి ప్రాంతాలకు మెగా పవర్ లూమ్ క్లస్టర్స్‌ను మంజూరు చేశారు. వాటికంటే పెద్ద హబ్ అయిన సిరిసిల్లకు మాత్రం కేంద్రం మొండి చేయి చూపించింది.

First Published:  2 Aug 2022 4:59 AM GMT
Next Story