Telugu Global
Telangana

చాయ్ అమ్ముకో కానీ దేశాన్ని మోసం చేయొద్దు..

దివ్యాంగులకు గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ కేటాయిస్తున్నామని అన్నారు మంత్రి కేటీఆర్. దుండిగల్ లో ఇచ్చే 1800 ఇళ్లలో 470 ఇళ్లను దివ్యాంగులకు కేటాయించామన్నారు.

చాయ్ అమ్ముకో కానీ దేశాన్ని మోసం చేయొద్దు..
X

"చాయ్ అమ్ముకో కానీ దేశాన్ని మోసం చేయొద్దు" అంటూ పరోక్షంగా ప్రధాని మోదీపై సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ అమ్ముకునే ఓ మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాగా.. ఆమెకు ఇంటి పత్రాలు అందించిన మంత్రి. చాయ్ అమ్మే ఓ వ్యక్తి దేశాన్ని మోసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఎక్కడా పక్షపాతం లేదని, అన్ని పార్టీల వాళ్లు లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు కేటీఆర్.


సంక్రాంతి గంగిరెద్దులు..

సంక్రాంతికి గంగిరెద్దులలాగా.. ఎన్నికలు రాగానే మిగిలిన పార్టీల నాయకులు నియోజకవర్గాలకు వస్తారని.. వారితో జాగ్రత్త అని సూచించారు మంత్రి కేటీఆర్. అమలుపరచలేని పథకాలను ప్రకటిస్తూ, మోసపు హామీలతో వచ్చేవారి పట్ల జాగ్రత్త అని హెచ్చరించారు. మరో సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు.

దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్..

హైదరాబాద్ లో కట్టే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9818కోట్లు కేటాయించిందని చెప్పారు మంత్రి కేటీఆర్. దివ్యాంగులకు గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ కేటాయిస్తున్నామని అన్నారు. దుండిగల్ లో ఇచ్చే ౧౮౦౦ ఇళ్లలో 470 ఇళ్లను దివ్యాంగులకు కేటాయించామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వారికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చాయని, వారి పేర్లు చదివి వినిపించారు.

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 560 చదరపు అడుగుల్లో ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు కేటీఆర్. 73వేల కోట్ల రూపాయలు రైతు బంధు అందిస్తున్నామని, దళితబంధు ఇస్తున్నామని చెప్పారు. కరోనా వల్ల రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, కేటాయింపు ఆలస్యమైందని అన్నారు. 9 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్-1 గా ఎదిగిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.


First Published:  21 Sep 2023 9:36 AM GMT
Next Story