Telugu Global
Telangana

సీఎం కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్‌ మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారు.

సీఎం కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్‌ మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పిన మంత్రి కేటీఆర్
X

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్ఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న తేడా ఏంటో మున్సిపల్ మంత్రి కేటీఆర్ వివరించారు. చంద్రబాబు ఐటీ, బిజినెస్ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునే వారు. వైఎస్ఆర్ రైతులు, సంక్షేమం, పేదల‌పై దృష్టి పెట్టారు. వారిద్దరూ కేవలం కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని కూడా ఆయన మారువలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

హైదరాబాద్ నగరం నాది అని చెప్పుకోవడానికి మనమే కాకుండా, మన పిల్లలు కూడా గర్వ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఎన్నో అనుమానాలు, అపోహలు ఏర్పాడ్డాయి. ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్లు చాలా కంగారు పడ్డారు. 10 ఏళ్ల క్రితం ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. పవర్ హాలీడేలు పెడితే మేము ఎలా బతకాలి, మా కార్మికులకు ఎలా ఉపాధి దొరుకుందని ఆవేదన చెందారు. ఒక వైపు రైతుల ధర్నాలు. మోటార్లకు కరెంటు కావాలని.. మరోవైపు నీళ్ల గోస ఉండేది. అప్పట్లో ఊర్లలోకి పోవాలంటే భయమేస్తుండేది. కరెంటు, నీళ్లకు కూడా ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తున్నాము. నీళ్ల బాధ తీరింది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయిన కేటీఆర్ చెప్పారు. 1940లో కట్టిన అప్పర్ మానేరు కోసం రైతులు హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎండాకాలంలో కూడా నిండు కుండలా ఉందని చెప్పారు. ఇలాంటి మార్పులు రావాలంటే నాయకుడిలో చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే సాధ్యపడిందంటే అందుకు సీఎం కేసీఆర్ దార్శనికతే కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఎక్కడ ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఎక్కడకు వచ్చిందో ప్రతీ ఒక్కరు ఆత్మావలోకనం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. ఒక పార్టీ తెలంగాణలో 50 ఏళ్లు అధికారంలో ఉన్నది.. మరో పార్టీ 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది. మరి వారు కరెంటు, నీటి సమస్యను ఎందుకు తీర్చలేకపోయారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వంటి బలమైన నాయకుడు ఉండటం వల్లే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఈ సారి 95కు పైగా సీట్లు గెలుస్తాం..

జేబులో వంద రూపాయలు ఉంటే.. కింద ఉన్న చిల్లరను ఎవరూ ఏరుకోవాలని అనుకోరు. అలాగే మంచిగా పని చేసే ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని కాదని ఎవరూ ఇతరులకు అవకాశం ఇవ్వరని కేటీఆర్ చెప్పారు. అందుకే 2014లో 63 సీట్లు వస్తే.. 2018లో 80కి పైగా సీట్లు గెలుచుకున్నాము. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 95 నుంచి 100 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

టీఎస్ బీ-పాస్, టీఎస్ ఐ-పాస్‌ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాము. ఎవరైనా బిల్డింగ్ నిర్మాణానికి కానీ, పరిశ్రమ స్థాపించాలనుకున్నా.. ఈ రెండు పోర్టల్స్ ద్వారా స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవచ్చు. 21 రోజుల్లోనే అన్ని అర్హతలు ఉంటే అనుమతులు లభిస్తాయి. 22 రోజుల తర్వాత అనుమతులు రాకపోతే.. మీరు నిర్మాణం లేదా పరిశ్రమ ప్రారంభించుకోవచ్చని చెప్తున్నాం. అలాగే అనుమతులు ఇవ్వని అధికారులకు రోజుకు రూ.1000 జరిమానా విధిస్తున్నాం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి విధానాలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇప్పటి వరకు తెలంగాణలో మేం చేసిన, మీరు చూసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ఇక ముందు ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేను ఎలక్షన్లలో లాభం కోసం ఇది చెప్పడం లేదు. మనం ఇంకా బుడిబుడి నడకలు వేస్తున్నాము. సీఎం కేసీఆర్ ప్రణాళికలు ఇంకా ఉన్నాయి.. తెలంగాణ మరింత అభివృద్ది చెందనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ట్యాక్స్ పేయర్లు కానిదెవరు..?

చాలా మంది ట్యాక్స్‌ పేయర్ల మనీ వేస్ట్ చేయవద్దు అని ప్రచారం చేస్తుంటారు. ఈ దేశంలో ట్యాక్స్ పేయర్లు కానిది ఎవరో చెప్పాలని కేటీఆర్ అన్నారు. సబ్బు, ఉప్పు, పప్పు.. చివరకు పిల్లలు తాగే పాలు, మనం తినే పెరుగు మీద కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దేశంలో బతికే ప్రతీ ఒక్కరు ట్యాక్స్ కడుతున్నారు. అలాంటప్పుడు ట్యాక్స్ పేయర్ల మనీ వేస్ట్ చేయవద్దని ఒక వర్గం ప్రచారం చేయడం బాధకరమని కేటీఆర్ అన్నారు.

కోవిడ్ తర్వాత మన దేశంలో పేదల సంఖ్య పెరిగింది. ఇప్పుడు భూమ్మీద అత్యధిక పేదలు ఉన్న దేశం ఇండియానే అని కేటీఆర్ చెప్పారు. నైజీరియా కంటే అత్యధిక పేదలు మన దగ్గర ఉన్నారు. ఒకవైపు మనం రాకెట్లు పంపుతున్నాము. కానీ పేదలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో స్కై టవర్స్ ఉన్నాయి. అక్కడే మురికి వాడలు కూడా ఉన్నాయి. కేవలం భవనాలు చూసుకొని మురిసిపోదామా? పేదలను పట్టించుకోవద్దా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూం‌లను ఉచితాలు అనడం ఎంత వరకు సమంజసం అన్నారు. పేదలను చూడకపోతే సమాజంలో ఆంతర్యాలు పెరిగిపోతాయి. అంతర్యుద్దానికి దారి తీస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. అందుకే అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు.

First Published:  29 Jun 2023 9:34 AM GMT
Next Story