Telugu Global
Telangana

తెలంగాణ‌లో త్వ‌ర‌లో మ్యూజిక్ స్కూల్‌, యూనివ‌ర్సిటీ.. - మంత్రి కేటీఆర్‌

మంత్రి కేటీఆర్ మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ప్ర‌స్తావ‌న‌కు వెంట‌నే స్పందించిన ఇళయ‌రాజా మాట్లాడుతూ.. మంత్రే వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను వ‌రాలు కోరుకోమంటుంటే ఆనందంగా ఉంద‌ని చెప్పారు.

తెలంగాణ‌లో త్వ‌ర‌లో మ్యూజిక్ స్కూల్‌, యూనివ‌ర్సిటీ.. - మంత్రి కేటీఆర్‌
X

తెలంగాణ‌లో మ్యూజిక్ స్కూల్‌, మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు అంగీక‌రించ‌డంతో త్వ‌ర‌లోనే దీనిని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన `మ్యూజిక్ స్కూల్` సినిమా ఈనెల 12న విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ హైద‌రాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాతో క‌లిసి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ వేడుక‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మ్యూజిక్ యూనివ‌ర్సిటీ లాంటి వ్య‌క్తి ఇళ‌య‌రాజాతో క‌లిసి వేదిక పంచుకోవ‌డం గౌర‌వంగా ఉంద‌ని చెప్పారు. పిల్ల‌ల‌కు సైన్స్‌, టెక్నాల‌జీ, ఇంజ‌నీరింగ్ విద్య‌తో పాటు సంగీత విద్య కూడా ప్రాధాన్యంగా ఉండాల‌ని తెలిపారు. ఇళ‌య‌రాజా అంగీక‌రిస్తే తెలంగాణ‌లో మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పారు.

200 మంది ఇళ‌య‌రాజాలు త‌యార‌వుతారు..

మంత్రి కేటీఆర్ మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ప్ర‌స్తావ‌న‌కు వెంట‌నే స్పందించిన ఇళయ‌రాజా మాట్లాడుతూ.. మంత్రే వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను వ‌రాలు కోరుకోమంటుంటే ఆనందంగా ఉంద‌ని చెప్పారు. మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ఏర్పాటుకు తాను అంగీక‌రిస్తున్న‌ట్టు తెలిపారు. మ్యూజిక్ యూనివ‌ర్సిటీ ఏర్పాటైతే త‌న‌లాంటి 200 మంది ఇళ‌య‌రాజాలు త‌యార‌వుతార‌ని ఆయ‌న చెప్పారు.

First Published:  7 May 2023 1:47 AM GMT
Next Story