Telugu Global
Telangana

యాదాద్రికంటే గొప్పగా భద్రాద్రి.. మాకివ్వండి ఒక్క ఛాన్స్

ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపిస్తే, వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్. యాదాద్రి కంటే గొప్పగా.. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

యాదాద్రికంటే గొప్పగా భద్రాద్రి.. మాకివ్వండి ఒక్క ఛాన్స్
X

భద్రాచలంలో ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. భద్రాచలంలో ఇంతవరకు బీఆర్ఎస్ బోణీ కొట్టలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచినవారు బీఆర్ఎస్ వైపు వచ్చారు కానీ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఈసారి కూడా ఆయన కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు మరోసారి బరిలో దిగారు. వెంకట్రావుకి మద్దతుగా మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈసారి భద్రాచలంలో బీఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు.

చిన్న చిన్న అసంతృప్తులను పక్కనపెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని భద్రాచలం ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 11 సార్లు గెలిచిన కాంగ్రెస్‌ 24 గంటల కరెంట్‌ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చామని చెప్పారు. తెలంగాణలో మరోసారి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

భద్రాచలం వచ్చినప్పుడు రాముడి పాదాలకు నమస్కరించాలనుకున్నానని, అధికారుల విజ్ఞప్తి మేరకు వెళ్లలేదని చెప్పారు కేటీఆర్. తొందర్లోనే మళ్లీ వచ్చి రామయ్య దర్శనం చేసుకుంటానని చెప్పారు. కారణాలు ఏవైనా భద్రాచలంలో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదని, ఈసారి కచ్చితంగా గులాబీ వనంలోకి భద్రాచలం చేరాలని చెప్పారు. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపిస్తే, వరదల ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. యాదాద్రి కంటే గొప్పగా.. భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది డబ్బు సంచులతో వస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని చెప్పారు కేటీఆర్.

First Published:  19 Nov 2023 12:23 PM GMT
Next Story