ఫైర్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి -కేటీఆర్..
డెక్కన్ స్పోర్ట్స్ మాల్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు మంత్రి కేటీఆర్. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాద ఘటనపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ భేటీకి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ భేటీలో చర్చించారు. ఫైర్ సేఫ్టీ లేని భవనాలను గుర్తించడంతోపాటు, తీసుకోవాల్సిన చర్యలు, పాత భవనాలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, సెల్లార్లలో అక్రమ వ్యాపారాల నివారణకు కార్యాచరణ రూపొందించడంపై కూడా చర్చించారు.
డెక్కన్ మాల్ బాధితులకు పరిహారం..
డెక్కన్ స్పోర్ట్స్ మాల్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు మంత్రి కేటీఆర్. మూడు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో అక్రమంగా నిర్మిస్తున్న భవనాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.
అగ్నిమాపక శాఖకు నిధులు..
అగ్నిమాపక శాఖ కీలకమైనదే అయినా నిధుల లేమితో సతమతమవుతోందని అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అగ్నిమాపకశాఖకు భారీగా నిధులు కేటాయించాలని, ఈ బడ్జెట్ నుంచే ఈ కేటాయింపులను అమలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు కేటీఆర్.
ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే చర్యల్లో భవన యజమానులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారాయన. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాలన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలని, విదేశాల్లో ఫైర్ సేఫ్టీపై అధ్యయనం చేయాలని చెప్పారు.
అవసరమైన ఆధునిక సామగ్రి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అత్యవసర సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.