Telugu Global
Telangana

కొత్త మెట్రో లైన్లపై కేబినెట్ భేటీలో చర్చ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్

నగరంలోని చాలా ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా మంది సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు.

కొత్త మెట్రో లైన్లపై కేబినెట్ భేటీలో చర్చ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల కొత్త మెట్రో లైన్ల నిర్మాణం కోసం త్వరలో జరుగనున్న కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో.. ఐటీ సెక్టార్‌లో వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో పలు ఫ్లైవోర్లు, అండర్ పాస్‌లు తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. మాధాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో అనేక ఫ్లైవోర్లు నిర్మించింది. అయినా సరే సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి క్లియర్ చేయడానికి ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగాల్సి వచ్చింది. తరచుగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. నగరంలోని ఉప్పల్, కంటోన్మెంట్, అమీర్ పేట, బేగంపేట ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

నగర శివారుల నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వైపు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నగరంలోని చాలా ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ, బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా మంది సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మెట్రో పొడిగింపు, ఎంఎంటీఎస్, టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం సరైన మార్గమని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లగా.. ఆయన స్పందించారు.

మెట్రోలైన్ల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని కేటీఆర్ చెప్పారు. మెట్రోను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకున్నదని, నెక్ట్స్ కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్.. తాను చూస్తున్న మున్సిపల్ శాఖను దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరంలో ఒక స్థిరమైన ప్రజా రవాణాను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చిన మంత్రి కేటీఆర్ వివరించారు.


First Published:  25 July 2023 3:29 AM GMT
Next Story