Telugu Global
Telangana

రష్మిక మార్ఫింగ్ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందన

ఇటీవలే ఎమ్మెల్సీ కవిత కూడా ఈ డీప్ ఫేక్ వీడియోపై స్పందించారు. రష్మికకు మద్దతుగా నిలబడ్డారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రష్మికకు మద్దతుగా మాట్లాడారు.

రష్మిక మార్ఫింగ్ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందన
X

హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు మద్దతుగా చాలామంది మెసేజ్ లు పెడుతున్నారు, తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై స్పందించారు. అది ఓ అవమానకరమైన చర్య అని అన్నారు కేటీఆర్. ఆ డీప్ ఫేక్ వీడియో గురించి తాను కూడా వార్తల్లో చూశానన్నారు. అది ఓ చేదు అనుభవమని, ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమని అన్నారు కేటీఆర్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి చట్టాలు తెస్తే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కేటీఆర్.

కలకలం రేపిన వీడియో..

పుష్ప సినిమాతో రష్మిక జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. తాజాగా యానిమల్ అనే బాలీవుడ్ మూవీలో రణబీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించారు. జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న రష్మిక వీడియోని మార్ఫింగ్ చేయడంతో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలీవుడ్ హీరోలు సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. అయితే ఇప్పటి వరకూ ఆ వీడియో ఎవరు మార్ఫింగ్ చేశారు, ఎవరు వైరల్ చేశారనేది మాత్రం తేలలేదు.

ఇటీవలే ఎమ్మెల్సీ కవిత కూడా ఈ డీప్ ఫేక్ వీడియోపై స్పందించారు. రష్మికకు మద్దతుగా నిలబడతామన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా రష్మికకు మద్దతుగా మాట్లాడారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వీడియోని సీరియస్ గా తీసుకుంది. సోషల్ మీడియా సంస్థలకు కూడా పలు సూచనలు చేసింది.

First Published:  8 Nov 2023 9:38 AM GMT
Next Story