Telugu Global
Telangana

ప్రజలే కేంద్ర బిందువుగా తెలంగాణలో సుపరిపాలన..

ఆగస్ట్ 8నుంచి 22వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నందుకు శుభాభినందలు తెలియజేశారు కేటీఆర్.

ప్రజలే కేంద్ర బిందువుగా తెలంగాణలో సుపరిపాలన..
X

ప్రజలే కేంద్ర బిందువుగా తెలంగాణలో సుపరిపాలన సాగుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న త్యాగధనులందరికీ ఘన నివాళులర్పిస్తున్నానని తెలిపారు. సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు తెలంగాణలో సుపరిపాలన సాగుతోందన్నారు కేటీఆర్. ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ సాధించుకున్నామో, ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తోందన్నారు.

ఆగస్ట్ 8నుంచి 22వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, ప్రజలందరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నందుకు శుభాభినందలు తెలియజేశారు కేటీఆర్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను మంత్రి కేటీఆర్ చదివి వినిపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ఘనత తెలంగాణకు దక్కుతుందని చెప్పారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.39 లక్షలమంది రైతులకు పంట పెట్టుబడి అందించామని చెప్పారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇథనాల్ డిస్టిలరీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా స్థానిక రైతులకు ఆదాయం, యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని చెప్పారు. వ్యవసాయ ఆధారిత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మానేరు జీవనదిగా మారిందని, సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేస్తోందని చెప్పారు. చేనేతలకు బీమా సౌకర్యం కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అరుదైన రికార్డ్ సాధించిందని అన్నారు కేటీఆర్. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సౌకర్యాలు, విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. స్వాతంత్ర భారతంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిలో సిరిసిల్ల జిల్లా తనవంతు పాత్ర పోషిస్తోందని అన్నారు.

First Published:  15 Aug 2022 7:42 AM GMT
Next Story