Telugu Global
Telangana

కుసుమ జగదీశ్‌కు మంత్రి కేటీఆర్ నివాళులు

గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అవకాశం కల్పించారు.

కుసుమ జగదీశ్‌కు మంత్రి కేటీఆర్ నివాళులు
X

గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. జగదీశ్‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌.. జగదీశ్ భౌతిక‌కాయానికి నివాళులర్పించారు.

కుసుమ జగదీశ్వర్‌ (47) ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హన్మ‌కొండ స్నేహనగర్‌లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. గన్‌మెన్ల సాయంతో భార్య రమాదేవి వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు. 14 ఏళ్ల పాటు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో జగదీశ్‌ కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అవకాశం కల్పించారు.

ఏప్రిల్‌ 1న జగదీశ్వర్‌ తొలిసారి గుండెపోటుకు గురయ్యారు. భార్య రమాదేవి సకాలంలో సీపీఆర్‌ చేయడంతో ప్రాణాలు దక్కాయి. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న నిర్వహించిన సంక్షేమ సంబురాల్లోనూ పాల్గొన్నారు. కుసుమ జగదీశ్ ఆకస్మిక మరణంపై పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  12 Jun 2023 8:08 AM GMT
Next Story