Telugu Global
Telangana

ఆ కమిషనర్‌ను సస్పెండ్ చేయండి : మంత్రి కేటీఆర్

నా బర్త్‌డే వేడుకలకు హాజరు కాలేదని నలుగురు ఉద్యోగులకు మెమో జారీ చేసిన విషయం తెలిసింది. మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయమని సీడీఎంఏకు తెలిపాను

ఆ కమిషనర్‌ను సస్పెండ్ చేయండి : మంత్రి కేటీఆర్
X



తెలంగాణలోని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతో చివరకు సస్పెన్షన్‌కు గురయ్యారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు రాలేదంటూ నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీస్ జారీ చేసి వ్యవహారంలో చివరకు మూల్యం చెల్లించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు ఈనెల 24. ఈ క్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం తరపున ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని.. ఉద్యోగులందరూ ఉదయం 10 గంటలకు అక్కడకు చేరుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ వాట్సప్ ద్వారా అందరికీ మెసేజెస్ చేశారు.

కేటీఆర్ పుట్టినరోజు నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ వేడుకలకు హాజరై కేక్ కట్ చేశారు. అయితే మున్సిపల్ కార్యాలయానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టమ్ మేనేజర్ మోహన్, బిల్ కలెక్టర్ శ్రావణ్ ఈ వేడుకలకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన మున్సిపల్ కమిషనర్ గంగాధర్.. ఈ నాలుగురికీ షోకాజ్ నోటీసులు జారీచేశారు. కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలకు ఎందుకు గైర్హాజరయ్యారో తెలుపుతూ వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.

ఈ షోకాజ్ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పార్టీ కార్యకర్తలు అధినేత మెప్పుకోసం ఏమైనా చేస్తే ఓకే. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఇలా కేటీఆర్ మెప్పుకోసం నోటీసులు జారీ చేయడమేంటనే విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒత్తిడి మేరకే ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా, ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఈ ఘటనను ఖండిస్తూ ఒక పోస్టు పెట్టారు.


'రాజకీయాల్లోగానీ, పరిపాలనలో గానీ ఇలాంటి చర్యల ద్వారా సానుభూతి పొందాలనుకునే వారిని ఎంకరేజ్ చేయడంలో నేను చాలా వెనక ఉంటాను. మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహంతో చేసిన పని గురించి నేను చదివాను. నా బర్త్‌డే వేడుకలకు హాజరు కాలేదని నలుగురు ఉద్యోగులకు మెమో జారీ చేసిన విషయం తెలిసింది. మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయమని సీడీఎంఏకు తెలిపాను' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

వాస్తవానికి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కోరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు ఉన్నందున ఈ సంబరాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దానికి బదులు 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తమకు దగ్గరగా ఉన్న వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కొంత మంది కేటీఆర్ బర్త్ డే వేడుక‌లను అట్టహాసంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే బెల్లంపల్లి కమిషనర్ వేడుక‌లు నిర్వహించడమే కాకుండా.. హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కేటీఆర్.. అత్యుత్సాహం ప్రదర్శించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలకు ఆదేశించారు.

First Published:  30 July 2022 2:41 AM GMT
Next Story