Telugu Global
Telangana

దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్ఛేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలోనే నిర్మించామని కేటీఆర్ చెప్పారు.

దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్ఛేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
X

దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్ఛేంజ్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పారు. నోవాటెల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. దేశానికే అన్నం పెట్టేంత ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో ఆయనకు వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలోనే నిర్మించామని కేటీఆర్ చెప్పారు. గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవి.. కానీ ఇప్పుడు వలసలనేవే లేవని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

అగ్రి ఉత్పత్తుల్లో తెలంగాణ ర్యాంకు 2014లో 25వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానానికి ఎదిగిందని చెప్పారు. దేశంలోనే అత్యంత క్వాలిటీ అయిన పత్తి తెలంగాణ నుంచే వస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణలో చెరువులను పునరుద్దరించామని.. రైతులకు మూడు పంటలకు సాగు నీరు అందిస్తున్నామని మంత్రి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని అభివృద్ధి చేశాయి. ఏడీఈఎక్స్ ఈ డేటా ఎక్ఛేంజ్‌కు సహకారం అందించింది. ఇది తెలంగాణ వ్యవసాయ రంగంలోసరి కొత్త అధ్యాయానికి తెర తీసిందని మంత్రి చెప్పారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అగ్రికల్చర్ డేటా మేనేజ్‌మెంట్ ఫ్రేమ్ వర్క్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.


First Published:  11 Aug 2023 11:05 AM GMT
Next Story