Telugu Global
Telangana

హైదరాబాద్‌కి మరో మణిహారం.. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్..

నానక్‌రామ్‌గూడ లో ఈ సైకిల్ ట్రాక్ కి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తారు. 2023 వేసవినాటికి ఈ సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వస్తుంది.

హైదరాబాద్‌కి మరో మణిహారం.. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్..
X

కింద కేలరీలు ఖర్చవుతాయి, పైన కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ రెండిటికీ ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టేనని చెప్పాలి. మెట్రో నగరాల్లో అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంటున్న హైదరాబాద్ కి ఇది మరో మణిహారం అనే చెప్పాలి. హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు. నానక్‌రామ్‌గూడ లో ఈ సైకిల్ ట్రాక్ కి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తారు. 2023 వేసవినాటికి ఈ సైకిల్ ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రాక్ పై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ ప్యానెల్స్ ద్వారా 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

ముందుగా ఐటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నా.. విడతలవారీగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్‌పీఎస్‌ వరకు 8.5 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో 14.5 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్‌ నిర్మించబోతున్నారు. సాధారణ సైకిల్‌ ట్రాక్‌ మాదిరిగానే కనపడుతున్నా.. ఆధునిక వసతులతో దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఈ ట్రాక్‌ 4.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. రెండువైపులా ఒకమీటర్ వెడల్పుతో గ్రీన్ కారిడార్ ఉంటుంది. పచ్చని చెట్లు పెంచుతారు.


దక్షిణ కొరియా స్ఫూర్తితో..

దక్షిణ కొరియాలోని డేజియాన్‌ - సెజోంగ్‌ నగరాల మధ్య 32 కిలోమీటర్ల మేర ఆధునిక వసతులతో ఉన్న సైకిల్‌ ట్రాక్‌ ను ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలించి వచ్చారు. అక్కడి నమూనాతో ఇక్కడ కూడా అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ లు అందుబాటులోకి వస్తే.. ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలుగా సైకిళ్లను కూడా వినియోగించే అవకాశముంది. ట్రాఫిక్ క‌ష్టాలు ఉండవు, పర్యావరణ హితం, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇలా అన్నిరకాల ఉపయోగాలు ఈ సైకిల్ ట్రాక్ తో ఉన్నాయి. పైగా సోలార్ రూఫ్ టాప్ తో.. విద్యుత్ ఉత్పత్తి కూడా అదనపు ప్రయోజనంగా ఉంటుంది.

First Published:  6 Sep 2022 2:51 PM GMT
Next Story