Telugu Global
Telangana

ఐఫోన్ తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ

సుమారు రూ.1,656 కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌.. ఇక్కడ ఐ ఫోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కంపెనీలో దాదాపు 35వేల మందికి ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా.

ఐఫోన్ తయారీ కేంద్రానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ
X

రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లో ఐ ఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్ కాన్ కొత్త కేంద్రానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంగర్ కలాన్ లో పరిశ్రమ ఏర్పాటుకి తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656 కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌.. ఇక్కడ ఐ ఫోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కంపెనీలో దాదాపు 35వేలమందికి ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా.

ప్రపంచంలో సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌ కాన్‌ కంపెనీయే తయారు చేస్తోంది. యాపిల్‌ సంస్థ నుంచి ఫాక్స్‌ కాన్‌ కు మరింత భారీ ఆర్డర్‌ రావడంతో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తమ తయారీ కేంద్రాలను విస్తరిస్తోంది ఫాక్స్ కాన్. ఇందులో భాగంగానే తెలంగాణను ఎంపిక చేసుకుంది. భూమిపూజ తర్వాత ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటుకి వడివడిగా అడుగులు పడతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది చివరినాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని ఫాక్స్ కాన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.


ఎయిర్ పాడ్ లు, వైర్ లెస్ ఇయర్ ఫోన్లు..

కొంగర్ కలాన్ లో ఏర్పాటు చేస్దున్న తయారీ కేంద్రంలో ఎయిర్ పాడ్ లు, వైర్ లెస్ ఇయర్ ఫోన్లు కూడా ఉత్పత్తి చేస్తారని తెలుస్తోంది. ఇటీవలే ఫాక్స్ కాన్ బృందం తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమై పరిశ్రమ ఏర్పాటు గురించి చర్చించింది. తక్కువ వ్యవధిలోనే ఈ కంపెనీ ఏర్పాటుకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు రావడంతో ఈరోజు పని మొదలు పెట్టారు. మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

First Published:  15 May 2023 7:59 AM GMT
Next Story