Telugu Global
Telangana

ప్రగతి నిరోధకుల్లారా..! అభివృద్ధిని అడ్డుకోకండి : కేటీఆర్

ఇవాళ మహబూబ్‌నగర్‌కు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

ప్రగతి నిరోధకుల్లారా..! అభివృద్ధిని అడ్డుకోకండి : కేటీఆర్
X

దుష్ప్ర‌చారాలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ప్రగతి నిరోధకులను కోరుతున్నానంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీ‌కారం చుట్టారు.. ఐటీ టవర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేయనున్న అమర్‌రాజా సంస్థకు చెందిన గిగా కారిడార్ కు కేటీఆర్ భూమిపూజ చేశారు.




ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది పోటీ ప్రపంచమని.. ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప పరిశ్రమలు తీసుకురాలేమన్నారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రాలతో మాత్రమే కాకుండా ఎన్నో దేశాలతో పోటీ పడి పారిశ్రామికవేత్తలను మెప్పించి రాష్ట్రానికి రప్పించాల్సి వస్తుందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అన్నారు. భారతదేశంలో యువత 65 శాతం ఉందని...వీరందరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యమన్నారు. అయితే ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని...అప్పుడే ఉద్యోగాలు.. రాష్ట్రానికి సంపద వస్తుందన్నారు.



ఇవాళ మహబూబ్‌నగర్‌కు అమర్ రాజా బ్యాటరీ కంపెనీ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. దీని వల్ల పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. దీన్ని చూసి మరిన్ని పరిశ్రమలు ముందుకొస్తాయన్నారు. తెలంగాణలో ఆహార ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితం గల్లా జయదేవ్ ను కోరితే...రాష్ట్రంలో ఏదైనా భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారన్నారు కేటీఆర్. ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తలను ఒప్పించి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడి పరిశ్రమలు తీసుకొస్తే...ఇది జీర్ణించుకోలేని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది బ్యాటరీ సంస్థ కాబట్టి కాలుష్య సమస్యలు ఏర్పాడతాయంటున్నారని.. నిజానికి ఇక్కడ పెట్టబోయేది లిథియం అయాన్ బ్యాటరీ తయారీ యూనిట్ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

First Published:  6 May 2023 1:49 PM GMT
Next Story