Telugu Global
Telangana

కుల్కచర్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది

మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందజేస్తామన్నారు మంత్రి కేటీఆర్. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఆడిబిడ్డకు రూ.3వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు.

కుల్కచర్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది
X

కుల్కచర్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనది అని హామీనిచ్చారు మంత్రి కేటీఆర్. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. కుల్కచర్లలో రోడ్ షో లో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహేష్ రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మేనిఫెస్టో అంశాలను కూడా మరోసారి ప్రస్తావించారు కేటీఆర్.

ధరణి తీసేస్తే దళారి రాజ్యం..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అంటున్నారని, ధరణి తీసేస్తే రైతుల భూములు దళారుల చేతుల్లోకి పోతాయన్నారు మంత్రి కేటీఆర్. ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో కరెంట్‌ సరఫరా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, 75 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు రైతుబీమా అందించామన్నారు కేటీఆర్. రైతు చనిపోతే వారం రోజుల్లోనే రైతుబీమా రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు.

మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందజేస్తామన్నారు మంత్రి కేటీఆర్. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఆడిబిడ్డకు రూ.3వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. దళితులు, గిరిజనుల అసైన్డ్‌ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలు చేశామని పేర్కొన్నారు. గిరిజనులకు 6 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో అన్నీ చక్కదిద్దుకున్నామన్నారు కేటీఆర్.

First Published:  13 Nov 2023 1:11 PM GMT
Next Story