Telugu Global
Telangana

ఏపీకి 'రాంరాం'.. తెలంగాణకు జిందాబాద్

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. దావోస్ సదస్సుకి వెళ్లడంతోపాటు, ఇతర విదేశీ పర్యటనల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న మంత్రి కేటీఆర్ తెలంగాణను పరిశ్రమల హబ్ గా మారుస్తున్నారు.

ఏపీకి రాంరాం.. తెలంగాణకు జిందాబాద్
X

జాకీ బ్రాండ్ తో లో దుస్తులు తయారు చేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో ఇటీవల రెండు యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చింది. వాస్తవానికి పేజ్ ఇండస్ట్రీస్ మొదటగా కర్మాగారాల ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ని ఎంపిక చేసుకుంది. కానీ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదంతా ఎందుకు జరిగింది. ఏపీలో ఆ కంపెనీకి ఏం కష్టమొచ్చింది, తెలంగాణ నుంచి ఎలాంటి భరోసా లభించింది. దక్షిణాదికి వస్తున్న కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి..?

దక్షిణాదిలో భారీ దుస్తుల తయారీ కేంద్రాలు పెట్టాలనుకున్న పేజ్ ఇండస్ట్రీస్ కొత్త రాష్ట్రం కాబట్టి ముందుగా ఏపీవైపు చూసింది. అనంతరపురం జిల్లాలోని రాప్తాడులో 27 ఎకరాల భూమిని గత టీడీపీ ప్రభుత్వం 2017లో కేటాయించింది. 129 కోట్ల రూపాయల పెట్టుబడితో తయారీ కేంద్రం, భారీ గోడౌన్ ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. అయితే కంపెనీ ఉత్సాహంగా ఉన్నా స్థానిక ప్రజా ప్రతినిధులతో వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. నాయకులనుంచి డిమాండ్లు పెరిగాయి. వాటిని తీర్చలేని కంపెనీ జెండా ఎత్తేసింది. ఏపీలో తమ కంపెనీ స్థాపించలేమని, తమకు కేటాయించిన భూముని వెనక్కి ఇచ్చేస్తున్నామని, తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని ఏపీ పరిశ్రమల శాఖకు పేజ్ ఇండస్ట్రీస్ లేఖ రాసింది.

తెలంగాణ రెడ్ కార్పెట్..

ఏపీలో వర్కవుట్ కాకపోయే సరికి పేజ్ ఇండస్ట్రీస్ ప్రత్యామ్నాయం ఆలోచించింది. తెలంగాణలో కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇటీవలే మంత్రి కేటీఆర్ ని కలిసిన పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఇబ్రహీం పట్నం, ములుగు ప్రాంతాల్లో తమ యూనిట్లు స్థాపిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం, ప్రోత్సాహంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పేజ్ ప్రతినిధులు పేర్కొనడం గమార్హం.

ఏపీ అలా.. తెలంగాణ ఇలా..

వాస్తవానికి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వివిధ కంపెనీలను ఆహ్వానించే విషయంలో మరింత ఉదారంగా ఉండాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ లో జరుగుతోంది. అభివృద్ధి కంటే సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేయడంపైనే అధిక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోవడంలేదు. తెలంగాణలో మాత్రం పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. దావోస్ సదస్సుకి వెళ్లడంతోపాటు, ఇతర విదేశీ పర్యటనల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్న మంత్రి కేటీఆర్ తెలంగాణను పరిశ్రమల హబ్ గా మారుస్తున్నారు. తాజాగా పేజ్ ఇండస్ట్రీస్ విషయంలో కూడా ఆయన ఇదే ఫార్ములా ఉపయోగించారు. అన్నిరకాల అనుమతులను వేగంగా మంజూరు చేయించి ఆ కంపెనీని తెలంగాణకు ఆహ్వానించారు. గతంలో కూడా వివిధ అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణలో అనుమతులు వేగంగా మంజూరయ్యాయి. కేవలం 11 రోజుల్లో అన్ని రకాల అనుమతులిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పరిశ్రమల స్థాపన, ఉపాధికల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అటు ఏపీలో నాయకులే కంపెనీలకు చుక్కలు చూపిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రాన్ని పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చింది.

First Published:  21 Nov 2022 2:51 AM GMT
Next Story