Telugu Global
Telangana

కామారెడ్డి బీఆర్ఎస్‌లో జోష్ నింపుతున్న మంత్రి కేటీఆర్

రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రచార బాధ్యతల్లో మునిగి పోయారు. అయితే కామారెడ్డిలో మాత్రం మంత్రి కేటీఆర్ పూర్తి దృష్టి పెట్టారు.

కామారెడ్డి బీఆర్ఎస్‌లో జోష్ నింపుతున్న మంత్రి కేటీఆర్
X

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రచారం, ఇతర కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు, ఇంచార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి చూసుకుంటున్నారు. అయితే కామారెడ్డిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. నియోజకవర్గ బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు.

రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రచార బాధ్యతల్లో మునిగిపోయారు. అయితే కామారెడ్డిలో మాత్రం మంత్రి కేటీఆర్ పూర్తి దృష్టి పెట్టారు. అక్కడే ఉంటూ ఆయన ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తన నియోజకవర్గం అయిన సిరిసిల్ల కంటే కామారెడ్డిలోనే మంత్రి కేటీఆర్ ఎక్కువగా గడుపుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలం, గ్రామంపై కేటీఆర్ ఫోకస్ పెట్టారు. నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కామారెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ఇప్పటికే మాచారెడ్డి, రామారెడ్డి మండలాలతో పాటు కామారెడ్డి పట్టణంలో సభలు నిర్వహించారు. భిక్కనూరు, రాజంపేట మండలాలకు కలిపి భిక్కనూరులో సభ నిర్వహించారు. దోమకొండ, బీబీపేట మండలాలకు సంబంధించి దోమకొండలో కేటీఆర్ సభలు నిర్వహించరు. ఒక వైపు సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి బీఆర్ఎస్ మేనిఫెస్టోను తీసుకెళ్తూనే.. పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలు జరుపుతున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దీనిపై కూడా కేటీఆర్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కొడంగల్‌లో నరేందర్ రెడ్డిపై ఓడిపోయిన రేవంత్‌.. కామారెడ్డిలో సీఎంపై పోటీ చేసి గెలుస్తారా అంటూ గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

కామారెడ్డి బీఆర్ఎస్‌లో నెలకొన్న విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. నాయకులతో స్వయంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కలిసి పని చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పట్టణంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బూత్ స్థాయిలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో కార్యకర్తలకు వివరించారు. ప్రతీ 100 మంది ఓటర్లకు ఒక ఇంచార్జీని నియమించుకొని ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు. మరోవైపు ఇంచార్జీలుగా ఉన్న ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లకు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా కార్యకర్తల సమావేశఆలు ఏర్పాటు చేసి.. బూత్ కమిటీల జాబితాను కేటీఆర్ రూపొందించారు. కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేటీఆర్.. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే.. వ్యతిరేకంగా పని చేస్తున్న నాయకులకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తున్నది. సెగ్మెంట్‌లోని కీలకమైన నేతలకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలుసుకొని.. వాటిని పరిష్కరిస్తామనే హామీని ప్రజలకు ఇవ్వాలని చెబుతున్నారు. కేటీఆర్ పాల్గొనే సభల్లో కూడా వాటిపై స్పష్టత ఇస్తున్నారు. కార్యకర్తలు ప్రచారం కోసం ఇంటింటికీ తిరిగినప్పుడు ఇలాంటి సమస్యలపై సరైన సమాధానం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. సీఎం కేసీఆర్‌కు భారీ మెజార్టీ రావడంపైనే దృష్టి పెట్టాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ సూచించారు.

First Published:  2 Nov 2023 2:48 AM GMT
Next Story