Telugu Global
Telangana

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్..

సరిగ్గా అదే సమయానికి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఆ మార్గం ద్వారా రావడంతో వారిని ఆస్పత్రికి చేర్చడం సులభం అయింది. నేరుగా మంత్రి తన కాన్వాయ్ ఆపి దిగి రావడం చూసి బాధితులు ఉద్వేగానికి గురయ్యారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్..
X

మునుగోడు ఎన్నికల ప్రచారం చివరి రోజు. నారాయణ పూర్ లో రోడ్ షో ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు మంత్రి కేటీఆర్. ఆయన వెంట అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రచార పర్వం ముగిశాక గెలుపు వ్యూహాలతో, ఎత్తులు పైఎత్తులతో మరింత బిజీ అయి ఉంటారు కేటీఆర్. కానీ మానవత్వం మాత్రం మరచిపోలేదు. అంత బిజీగా ఉన్నా.. కాన్వాయ్ లో వెళ్తున్నా కూడా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయినవారిని చూసి కారు ఆపారు. తన మనుషుల్ని పంపించి వారికి సహాయం చేయించొచ్చు. కానీ నేరుగా మంత్రి కేటీఆర్ వారి వద్దకు వెళ్లారు. బాధితులతో మాట్లాడారు. వారు కదల్లేని స్థితిలో ఉండటంతో తన కాన్వాయ్ లో ఎక్కించుకుని హైదరాబాద్ ఆస్పత్రికి చేర్చారు.


కల్వకుర్తికి చెందిన ఆ భార్యా భర్తలిద్దరూ తమ పాపని హాస్టల్ లో దించి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. వారి బైక్ ప్రమాదానికి గురైంది. భార్యాభర్తలిద్దరూ దూరంగా పడిపోయారు. వారి చేతికి గాయాలయ్యాయి. లేవలేని స్థితిలో వారు రోడ్డు పక్కనే కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ఆ మార్గం ద్వారా రావడంతో వారిని ఆస్పత్రికి చేర్చడం సులభం అయింది. నేరుగా మంత్రి తన కాన్వాయ్ ఆపి దిగి రావడం చూసి బాధితులు ఉద్వేగానికి గురయ్యారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.


ట్విట్టర్ ద్వారానే కాదు..

ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ఎప్పుడూ బాధితులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ట్విట్టర్లో ఆయనకు చిన్న మెసేజ్ పెడితే చాలు, కచ్చితంగా రిప్లై ఇస్తారు. తనవంతు సాయం చేస్తారు, లేదా అధికారులను ఆదుకోవాలని సూచిస్తారు. ఇలా చాలామంది బాధితులు కేటీఆర్ ద్వారా సాయం అందుకున్నారు. కేటీఆర్ కి ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తే కచ్చితంగా న్యాయం జరుగుతుందనేది బాధితుల ఆశ. సోషల్ మీడియాలో తన వద్దకు వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న కేటీఆర్, ఇప్పుడు నేరుగా మార్గమధ్యంలో తనకు కనపడిన బాధితులకు సాయపడ్డారు. తన పెద్దమనసు చాటుకున్నారు.

First Published:  1 Nov 2022 3:45 PM GMT
Next Story