Telugu Global
Telangana

ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వద్దు -కేటీఆర్

ఇప్పటికే ఇలా వరద ముంపున‌కు గురైన వెంచర్లలో భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు వద్దు -కేటీఆర్
X

వరదల విషయంలో తక్షణ సాయం అందించి ప్రజలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం, భవిష్యత్తులో వరద ముంపు భయాలను తొలగించే దిశగా ఇప్పటినుంచే అడుగులు వేస్తోంది. వరదల సమయంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని పోతున్నాయి. అక్కడ అపార్ట్ మెంట్లు ఉన్నాయా, కాస్ట్ లీ వెంచర్లు వేశారా, గేటెడ్ కమ్యూనిటీయా ఇలాంటివేవీ వరదనీటికి పట్టవు, నీరు పల్లమెరుగుతూ పోతూ ఉంటుంది. పల్లంలో ఉన్న నిర్మాణాలు నీట మునుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇలా వరద ముంపున‌కు గురైన వెంచర్లలో భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వరద ముంపున‌కు గురైన వెంచర్లు, ఖాళీ స్థలాలపై మున్సిపల్ శాఖ దృష్టిపెట్టింది. ముంపు ప్రాంతాలు అని తెలిసినా ఇప్పటి వరకు అక్కడ అనుమతులిచ్చారు, ప్రజలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, వర్షాలు గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభావం చూపించాయి. దీంతో గరిష్ట వరద ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది, ఎంతమేర ఉంటుందనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. దీన్ని డేంజర్ లైన్ గా నిర్ణయించుకుని ఆ లోపు నిర్మాణాలకు అనుమతులివ్వకూడదని పురపాలక శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల శివారు భూములు, నివాసాలు, నీటమునిగాయి. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లను కూడా వరదనీరు చుట్టుముట్టింది. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. భారీవర్షాల వల్ల పట్టణాల్లోని ఏయే ప్రాంతాలు వరద ముంపుకి గురయ్యాయనే విషయమై పురపాలక శాఖ నివేదిక రూపొందించింది. ముంపుకి గల కారణాల జాబితా తయారు చేసింది. జీహెచ్‌ఎంసీ శివార్లలో ఉన్న గ్రామాలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా మారిన తర్వాత నగర విస్తరణ మరింత పెరిగింది. చెరువులు, కుంటలుగా ఉన్న ప్రాంతాలు కూడా పూడుకుపోయాయి. అక్కడే పట్టణాలు విస్తరిస్తున్నాయి. దీంతో సహజంగానే వర్షాలకు అవన్నీ నీటమునుగుతున్నాయి. ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది. కేటీఆర్ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ అనుమతుల విషయంలో కసరత్తులు చేస్తున్నారు అధికారులు.

First Published:  5 Aug 2022 6:00 AM GMT
Next Story