Telugu Global
Telangana

మాటలేమో సబ్ కా సాత్ - సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ బక్వాస్..

గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన మోదీ, పెట్రోల్ రేటు పెంచిన మోదీ, నేతన్నలపై జీఎస్టీ వేసిన మోదీని దేవుడని ఒకరంటారని, కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడని ఇంకొకరంటారని, ఢిల్లీ లో ఉన్నవాడు ఫేకుడు ఇక్కడున్నోడు జోకుడు అంటూ మండిపడ్డారు.

మాటలేమో సబ్ కా సాత్ - సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ బక్వాస్..
X

నిజామాబాద్ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. నిజామాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ హయంలోనే జరిగిందని చెప్పారు. గత 8 ఏళ్లలో 936 కోట్ల రూపాయలతో నిజామాబాద్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారాయన. ప్రతి పక్ష పార్టీలకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయని, తాను చెప్పిన లెక్కలు సరిచూసుకోవాలని హితవు పలికారు. ఇటీవలే నిజామాబాద్ నగరానికి సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. తిలక్ గార్డెన్ ను అభివృద్ధి చేయాలని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారన్నారు. రూ.50 కోట్లతో కళా భారతి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. మోడ్రన్ మెకనైజ్డ్ దోబీ ఘాట్ కి రూ.2 కోట్లు, నాయి బ్రాహ్మణుల కోసం రూ.2 కోట్లు కేటాయించామన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ ప్రారంభిస్తామని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులైనా తెచ్చారా అని ప్రశ్నించారు.

Advertisement

ఇదే మోదీ చివరి బడ్జెట్.. ఈసారయినా..

నరేంద్ర మోదీ ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారని, ఈసారయినా తెలంగాణకు నిధులు అడిగి సాధించుకుని రావాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్క విద్యాసంస్థ కూడా ఇవ్వలేదన్నారు. ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదన్నారు. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. దేనిని పట్టించుకోలేదన్నారు. పసుపు బోర్డుకి దిక్కులేదన్నారు.

Advertisement

2 లక్షల కోట్ల తెలంగాణ డబ్బులు పన్నుల రూపంలో కేంద్రానికి కడితే, మన సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు సోకులు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. మనం కేంద్రానికి ఎక్కువ డబ్బులు పంపిస్తే... కేంద్రం నుంచి మనకు వచ్చేది తక్కువేనని చెప్పారు. తెంలగాణ పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, తెలంగాణలో ఉన్న పథకాలు అక్కడ అమలులో లేవని చెప్పారు. ఢిల్లీలో ఉన్నవారు తెలంగాణకు అవార్డులిస్తారని, గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శలు చేస్తారని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారులు వేసి టోల్ టాక్సుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, మన డబ్బులతోనే రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు. మోదీ కంటే ముందు 14 మంది ప్రధానులు పని చేశారని, వారంతా కలసి 56 లక్షల కోట్లు అప్పులు చేస్తే, మోదీ ఒక్కరే 100 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేవలం 8ఏళ్ల కాలంలోనే ఆ స్థాయిలో అప్పులు చేసిన మోదీ దేశాన్ని పాతాళానికి తొక్కేశారని చెప్పారు. ఇంత అప్పులు చేసినా దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు కేటీఆర్.

గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచిన మోదీ, పెట్రోల్ రేటు పెంచిన మోదీ, నేతన్నలపై జీఎస్టీ వేసిన మోదీని దేవుడని ఒకరంటారని, కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడని ఇంకొకరంటారని, ఢిల్లీ లో ఉన్నవాడు ఫేకుడు ఇక్కడున్నోడు జోకుడు అంటూ మండిపడ్డారు. కార్పొరేట్లకు 12 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోదీ, పేద ప్రజలకు ఏం చేశారన్నారు. మోదీ అసమర్థ పాలన వల్ల రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందన్నారు మంత్రి కేటీఆర్.

Next Story