Telugu Global
Telangana

కారు కావాలా? బేకార్ కావాలా? : రామగుండం సభలో మంత్రి కేటీఆర్

ప్రజలు కారు కావాలా? కాంగ్రెస్ నుంచి వచ్చే బేకార్ కావాలా ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

కారు కావాలా? బేకార్ కావాలా? : రామగుండం సభలో మంత్రి కేటీఆర్
X

దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నదా? ఇవాళ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. పేదవాళ్లను కడుపున పెట్టుకొని చూసుకునే నాయకుడు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ పిచ్చోళ్లు 60 ఏళ్లు మనలను నానా బాధలు పెట్టారు. అలాంటి నాయకులు మనకు కావాలా? తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటెయ్యాలి. కాంగ్రెస్ వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. అసలు ఆ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతరో కూడా తెలియదు. అందుకే ప్రజలు కారు కావాలా? కాంగ్రెస్ నుంచి వచ్చే బేకార్ కావాలా ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రామగుండంలో ఏర్పాటు చేసిన దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ వచ్చారు. అసలు ఆయన ఏ ముఖం పెట్టుకొని వచ్చారో తెలియదు. కొన్నాళ్ల క్రితం కూడా రామగుండం వచ్చి ఒకే ఒక మాట అన్నారు. సింగరేణిని మేము ప్రైవేటీకరించం అని చెప్పి వెళ్లారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నదో అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ వరుసగా ప్రైవేటు పరం చేస్తున్నారు. టోకున ఏ అదానీకో మరొకరికో అమ్మేయడం.. ఆ వచ్చిన చందానో దందాతోనో రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనేయడం.. అక్కడ అధికారం చేపట్టడం. గత తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ ఇదే పరంపరగా పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని నేను అమ్మను అని ప్రధాని మోడీ నమ్మబలికారు. ఇక్కడి నుంచి వెళ్లిన వెంటనే సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు గనులను వేలానికి పెట్టారు. పైగా మీరు కూడా వేలంలో పాల్గొని దక్కించుకోండని ఉచిత సలహా ఇచ్చారని కేటీఆర్ అన్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఉచితంగా కేటాయించినట్లే సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కూడా నష్టాల బాట పట్టించి.. మీ దోస్తులకు కట్టబెట్టాలనే కుట్రలను పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.

సింగరేణిని ఆదుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమే. ఆ విషయాలన్నీ చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దక్షిణ భారత్‌నే గడగడలాడించింది సింగరేణి ఉద్యోగులే. అందుకే కేసీఆర్ 14 హామీలిచ్చి.. అన్నింటినీ నిలబెట్టుకున్నారని అన్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి మరిన్ని లాభాలతో వెలిగిపోతున్నదని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 18 శాతమే లాభాల్లో వాటా ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం 32 శాతం ఇచ్చిందని చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనే మనసు దేశంలో కేవలం కేసీఆర్‌కి మాత్రమే ఉన్నదని అన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల బిడ్డలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే నమ్మకం.. మోడీ అంటే అమ్మకం. తెలంగాణకు ప్రధాని వచ్చి ఎన్ని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని వస్తున్నది. 150 ఏళ్ల ముసలి నక్క పార్టీ ఇచ్చే వారెంటీ, గ్యారెంటీలు ఎలా చెల్లుతాయి. ఆ పార్టీ నాయకులు గొంతులు చించుకుంటుంటే చాలా గమ్మత్తుగా ఉన్నది. వాళ్లు ఏవేవో హామీలు ఇచ్చారు. ఒక్కఛాన్స్ ఇవ్వండంటూ మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మనం వారికి ఛాన్స్ ఇవ్వలేదా అని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల మాటలు, హామీలు నమ్మకండని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌ను పెద్దపల్లి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తానే నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మరింతగా అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

First Published:  1 Oct 2023 11:31 AM GMT
Next Story