Telugu Global
Telangana

అత్యంత అసమర్థ, పనికి రాని ప్రధాని మోదీ

ఓట్ల వేట కోస‌మే మోదీ తెలంగాణకు వ‌స్తున్నారని, ఓట్లు కావాలంటే చేసిన మంచి ప‌నులు చెప్పాలని, ఈ సారైనా ప్ర‌ధాని స్పందించి, పాప ప‌రిహారం చేసుకోవాలని, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్.

అత్యంత అసమర్థ, పనికి రాని ప్రధాని మోదీ
X

స్వతంత్ర భారత దేశ చరిత్రలో అత్యంత అసమర్థ, పనికిరాని ప్రధానిగా నరేంద్రమోదీ మిగిలిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప‌దేప‌దే అవ‌మానిస్తూ, అన‌వ‌స‌రంగా మోదీ ఎందుకు వ్యాఖ్యానిస్తున్నార‌ని ప్ర‌శ్నించారాయన. పార్ల‌మెంట్‌ తో పాటు బ‌హిరంగ వేదిక‌ల మీద ఎందుకు విషం చిమ్ముతున్నారంటూ నిల‌దీశారు. తెలంగాణ అంటేనే గిట్ట‌న‌ట్టు, ప‌గ‌బ‌ట్టిన‌ట్టు, తెలంగాణ‌ పుట్టుక‌ను, అస్థిత్వాన్ని ఎందుకు అగౌర‌వ‌ప‌రుస్తున్నారని అన్నారు. అమృత కాల్ స‌మావేశాల‌ని చెప్పి.. తెలంగాణ స‌మాజంపై విషం చిమ్మారని ధ్వజమెత్తారు. మోదీ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాష్ట్ర విభ‌జ‌న హామీల‌కు కూడా ఆయన పాతరేశారని విమర్శించారు.


అక్టోబ‌ర్ 1వ తేదీన పాల‌మూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కేటీఆర్. కృష్ణా జలాల్లో వాటా తేల్చ‌ని మోదీకి పాలమూరులో కాలు పెట్టే నైతిక హ‌క్కు లేదన్నారు. పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు స‌హ‌క‌రించాలని, జాతీయ హోదా ఇవ్వాల‌ని కోరామని, కాళేశ్వ‌రం లేదా పాల‌మూరుకు జాతీయ హోదా ఇవ్వాల‌ని ఎన్నోసార్లు అడిగామని గుర్తు చేశారు. క‌రువులు, క‌న్నీళ్లు, వ‌ల‌స‌ల‌తో గోస‌ప‌డ్డ పాల‌మూరు ఇప్పుడిప్పుడే ప‌చ్చ‌బ‌డుతుంటే.. ప్ర‌ధాన మంత్రి, ఆయ‌న పార్టీ ప‌గ‌బ‌ట్టిందని చెప్పారు. కృష్ణా జ‌లాల్లో వాటా తేల్చ‌మ‌ని ట్రిబ్యున‌ల్‌ కు రెఫ‌ర్ చేయ‌డానికి ఎందుకు మ‌న‌సు రావ‌డం లేదని ప్రశ్నించారు. ఒక్క మాట‌, ఒక్క సంత‌కం పెట్టే తీరిక లేదా..? నికృష్ట రాజ‌కీయం ఎందుకు అని మోదీని నిల‌దీశారు కేటీఆర్. ఓట్ల వేట కోస‌మే మోదీ తెలంగాణకు వ‌స్తున్నారని, ఓట్లు కావాలంటే చేసిన మంచి ప‌నులు చెప్పాలని, ఈ సారైనా ప్ర‌ధాని స్పందించి, పాప ప‌రిహారం చేసుకోవాలని, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్.

బీజేపీకి పుట్టగతులు ఉండవు..

బీజేపీ జాతీయ పార్టీ కానే కాదని, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన ద‌గుల్బాజీ పార్టీ అని అన్నారు మంత్రి కేటీఆర్. రాబోయే శాస‌న‌స‌భ‌, లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు కావ‌డం ఖాయం అని చెప్పారు. బీజేపీకి తెలంగాణ‌లో పుట్ట‌గ‌తులుండ‌వన్నారు.


మోదీ ఏజెంట్ గా తెలంగాణ గవర్నర్

ఇద్దరు సమర్ధవంతులైన వ్యక్తులను ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేసి పంపిస్తే, వారికి అర్హత లేదంటూ గవర్నర్ సమాధానమిచ్చారని, ఆమె తీరు అస్సలు బాగాలేదన్నారు మంత్రి కేటీఆర్. తాము సిఫారసు చేసిన అభ్యర్థులకు అర్హత లేదంటున్న గవర్నర్ కి అసలు ఆ పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. గవర్నర్ ఆ పదవికి అన్ ఫిట్ అన్నారు. ఆమె గవర్నర్ లా కాకుండా మోదీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హడావిడి మొదలైన తర్వత వీరి హడావుడి మరీ ఎక్కువైందని తెలంగాణ పై నిరంతరం విషం చిమ్ముతూనే ఉన్నారని విమర్శించారు.


First Published:  27 Sep 2023 12:00 AM GMT
Next Story