Telugu Global
Telangana

పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు

లీజేజీ ఘటనలో పాత్ర ఉన్న బండి సంజయ్‌పై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. బండి సంజయ్‌పై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు
X

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కుట్ర వెనుక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్లు తేలింది. పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. కాగా, లీజేజీ ఘటనలో పాత్ర ఉన్న బండి సంజయ్‌పై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు.

'పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకు ప్రమాదం. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు' అని కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎస్సెస్సీ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా.. వరుసగా తెలుగు, హిందీ పేపర్లు వాట్సప్‌లో వైరల్ అయ్యాయి. దీనిని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నది.

ప్రియమైన మోడీ కాదు.. పిరమైన మోదీ..

దేశంలో నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా నిత్యావసర వస్తువుల నుంచి పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ టార్గెట్‌గా ట్వీట్ చేశారు.

'ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం.. గ్యాస్ పిరం.. గ్యాస్‌పై వేసిన దోశ పిరం.. అన్నీ పిరం.. పిరం.. జనం అంతా గరం గరం..' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే అంటున్నా.. ఆయన ప్రియమైన ప్రధాని మోడీ కాదు.. పిరమైన ప్రధాని మోడీ అంటూ సెటైర్ వేశారు. అలాగే ఇంధన ధరలు భారీగా పెరగడానికి కారణమైన ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌ను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


First Published:  5 April 2023 10:31 AM GMT
Next Story