Telugu Global
Telangana

బండి సంజయ్ ఒక తెలివిలేని దద్దమ్మ : మంత్రి కేటీఆర్

ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

బండి సంజయ్ ఒక తెలివిలేని దద్దమ్మ : మంత్రి కేటీఆర్
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తిప్పి కొట్టారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్దంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమే అనే కనీస పరిజ్ఞానం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి బీజేపీ గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల మా నిబద్దతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని కేటీఆర్ అన్నారు. రాజ్యంగబద్దంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలియకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వందకు పైగా సందర్భాల్లో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయయని.. ఇందులో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తేలిందని కేటీఆర్ చెప్పారు. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోనే గత 8 ఏళ్లలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై బండి సంజయ్ ఏమంటారని ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలపై ప్రధాని మోడీని కూడా బాధ్యుడిని చేసి ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ చేయగలరా అని కేటీఆర్ సవాలు విసిరారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. అక్కడ పేపర్లు లీకైన సందర్భంలో ఏనాడూ మంత్రిని కానీ, సీఎంను కానీ బీజేపీ బాధ్యులను చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ నాయకులే కీలకం సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇతర పార్టీలు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందించి.. సొంత ప్రభుత్వాలు ఉంటే మాత్రం మారోలా వ్యవహరించడమే బీజేపీ డబుల్ స్టాండర్డ్స్‌కు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.

భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థ రహిత ఆరోపణలు చేయడం బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిదర్శనం అని కేటీఆర్ పేర్కొన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్లు... ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్సీ అంశంతో ముడిపెట్టి బండి అసత్య ఆరోపణలు చేయడం సహించబోమని కేటీఆర్ అన్నారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థ రహితమైన, నిరాధారమైన ఆరోపణలు బండి సంజయ్ చేసి ప్రజాక్షేత్రంలో అభాసుపాలై.. పరువు నష్టం కేసును కూడా ఎదుర్కుంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

తమకు సంబంధం లేని టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని బండి సంజయ్‌పై కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రాబోయే రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారం వెలుగులోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం మెరుపు వేగంతో సిట్‌ను నియమించి.. బాధ్యులైన వారిని అరెస్టు చేసిన విషయం కేటీఆర్ గుర్తు చేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని కేటీఆర్ అన్నారు. ఒకవైపు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నా.. బీజేపీ మాత్రం మొత్తం వ్యవహారాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకుంటోందని అన్నారు. ఇలా సమాజంలో చిచ్చు పెట్టడం బీజేపీకి అలవాటే అని కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారాన్ని శాంతి భద్రతల సమస్యగా మార్చే కుట్రను బీజేపీ చేస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో పరీక్షలకు సిద్ధపడుతుంటే.. యువతను పరీక్షలు వదిలేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి నాయకుడికి యువత గురించి మాట్లాడే అర్హత లేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తే.. తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అని వ్యాఖ్యానించిన దుర్మార్గుడు బండి సంజయ్ అని కేటీఆర్ అన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం టీఎస్‌పీఎస్సీనే రద్దు చేయాలనే అడ్డగోలు వాదన చేయడం వెనుక కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలోని యువకులు ఎలాంటి ఆందోళనకు గురి కావల్సిన అవసరం లేదని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా రెండితలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ.. నిరుద్యోగుల పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాల దక్కాలన్న సమున్నత ఆశయంతో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొని వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం జరగనివ్వమని.. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసకుంటామని అన్నారు. టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని కేటీఆర్ చెప్పారు.

First Published:  17 March 2023 1:09 PM GMT
Next Story