Telugu Global
Telangana

ఎంపీ బండి సంజయ్.. నేను ప్రధాని మోడీని బ్రోకర్ అనలేను : మంత్రి కేటీఆర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత వాగుతా ఉంటాడు. నా గురించి మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నా పీఏ తిరుపతి గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.

ఎంపీ బండి సంజయ్.. నేను ప్రధాని మోడీని బ్రోకర్ అనలేను : మంత్రి కేటీఆర్
X

అదానీకి ప్రధాని మోడీ ఒక బ్రోకర్ అని నేను అనలేనా బండి సంజయ్.. కానీ అనను. నాకు మీ లాగా సంస్కారం లేదని అనుకుంటున్నారా? అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో సీఎం కేసీఆర్ ఒక బ్రోకర్ అని బండి సంజయ్ అంటున్నాడు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అందరికీ పేపర్లు పంచాడని బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఉత్త ముచ్చట్లు ఎంతకాలం చెప్తారు. సీఎం కేసీఆర్‌ను పట్టుకొని బ్రోకర్ అంటారా? నేను ఎవరికి ప్రశ్నాపత్రం రిలీజ్ చేశానో చెప్తారా? అని మంత్రి కేటీఆర్ వారిద్దరికీ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గం అత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

దేశాన్ని అదానీకి దోచి పెడుతున్న మీ ప్రధాని మోడీని బ్రోకర్ అని పిలవొచ్చు. కానీ నాకు సంస్కారం ఉంది. అందుకే నేను అనను అని బండి సంజయ్‌కి కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ప్రధాని మోడీని బ్రోకర్ అని పిలిచినా.. నేను మాత్రం అనలేను అని కేటీఆర్ స్పష్టం చేశారు. బ్రోకర్, లోఫర్, లుచ్చా అనే మాటలు మాకు కూడా వచ్చు. చదవమంటే చాలా చదువుతాము. అలా అనే దమ్ముంది. కానీ నేను అనను అని కేటీఆర్ చెప్పారు. నేను సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, వ్యవసాయ కాలేజీ, వ్యవసాయ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీ తీసుకొని వచ్చాను. నువ్వు తీసుకొచ్చిన ఒక చిన్న పాఠశాల చూపెడుతావా అని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత వాగుతా ఉంటాడు. నా గురించి మాట్లాడటం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నా పీఏ తిరుపతి గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రం మొత్తం తిరుపతే లీక్ చేసిండు. కేటీఆర్ పేషీ నుంచే మొత్తం జరిగింది. ఒకటే మండలంలో 100 మందికి వంద మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు పేలారని కేటీఆర్ అన్నారు. మీ ముందు కొన్ని నిజాలు చెప్పాలి. తిరుపతి సొంత మండలం మల్యాల నుంచి 417 మంది గ్రూప్స్-1 ప్రిలిమ్స్‌కు హాజరైతే.. క్వాలిఫై అయ్యింది 35 మంది మాత్రమే. ఇక జగిత్యాల జిల్లా నుంచి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒక్కరే. మరి రేవంత్ ఎలా మల్యాల నుంచి 100 మందికి వంద మార్కులు వచ్చాయని ఎలా ఆరోపణలు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

తిరుపతి సొంత ఊరు పోతారం. అక్కడ నుంచి ముగ్గురు పరీక్షకు హాజరైతే ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదు. మల్యాల హెడ్ క్వార్టర్‌లో ముగ్గురు రాస్తే.. ఒక్కరే క్వాలిఫై అయ్యారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4205 అప్లై చేశారు. 3,254 మంది పరీక్షకు హాజరైతే ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదని కేటీఆర్ అన్నారు. నిజంగా నేను పేపర్ లీక్ చేస్తే నా నియోజకవర్గం, తిరుపతి ఊరిలో అందరికీ 100 మార్కులు రావాలి కదా.. అని రేవంత్‌ను ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రంలో 13 పేపర్లు లీకైతే ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు రాజీనామా చేయలేదు. మరి ఇప్పుడు మాత్రం బండి సంజయ్ మాత్రం అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదేం డిమాండ్ అని అన్నారు.

ఏప్రిల్ 14న అందరూ హైదరాబాద్ రావాలి..

హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ రచయిత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏప్రిల్ 14న జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరూ హాజరవ్వాలని కేటీఆర్ కోరారు. ఏప్రిల్ 27న పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం కూడా నిర్వహిస్తున్నాము. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనాలను చక్కగా జరుపుకొని.. రాష్ట్రమంతటా ఏప్రిల్ 25నే బీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని కోరారు. ఆ తర్వాత 27న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుపుకుందామని చెప్పారు.

దళిత బంధు పథకం ఎంతో మందికి మేలు చేస్తోందని అన్నారు. దళితులకు సీఎం కేసీఆర్ అప్పనంగా డబ్బులు ఇస్తున్నాడని అనుకోవద్దని కేటీఆర్ చెప్పారు. దళితులు ఇప్పడు ఆ పథకం ద్వారా లబ్ది పొంది.. మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. దళిత బంధు దళితుల హక్కు అని.. అది వారికి ఉచితంగా ఇస్తున్న డబ్బులు కావని కేటీఆర్ అన్నారు. ఇక.. రాష్ట్రంలో పెండింగ్‌లో బిల్లులన్నీ మార్చి 31 లోగా క్లియర్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు. రూ.1 కోటి లోపు పెండింగ్ బిల్లులు విడుదల అవుతాయని ఆయన అన్నారు.


First Published:  27 March 2023 11:50 AM GMT
Next Story