Telugu Global
Telangana

వివక్ష, కక్ష సాధింపు.. ఇందుకేనా గవర్నర్లు..

ఇది కేవలం తెలంగాణ సమస్యే కాదు, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగే తంతు ఇదే. బీజేపీ అడుగులకు మడుగులు వత్తే పార్టీలు ఉన్నచోట మాత్రం సీఎం, గవర్నర్ భాయీభాయీ అన్నట్టుగా ఉంటారు

వివక్ష, కక్ష సాధింపు.. ఇందుకేనా గవర్నర్లు..
X

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. అత్యున్నత రాజకీయ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ ప్రతీకార సాధనాలుగా మారాయని మండిపడ్డారు. గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ వేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది దేశ అభివృద్ధికి సహాయపడే సహకార సమాఖ్య నమూనానా? టీమ్ ఇండియా స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ్నించారు.


పెండింగ్ బిల్లుల వ్యవహారం తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టాలని చూడటంతో అసలు వివాదం మొదలైంది. ఆమోదించకుండా, తిరస్కరించకుండా.. ఆమె బిల్లుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారనేది ప్రభుత్వ ఆరోపణ. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంటుంది కదా అంటూ అప్పట్లో సీఎస్ ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వెటకారం కూడా అందరికీ తెలిసిందే. ఈ కేసు విచారణకు రాబోతున్న సమయంలో హడావిడిగా గవర్నర్ మూడు బిల్లులను ఆమోదించారు, రెండిటిని తిప్పి పంపించేశారు. బిల్లులు పాస్ చేయించుకోవడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇది కేవలం తెలంగాణ సమస్యే కాదు, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగే తంతు ఇదే. బీజేపీ అడుగులకు మడుగులు వత్తే పార్టీలు ఉన్నచోట మాత్రం సీఎం, గవర్నర్ భాయీభాయీ అన్నట్టుగా ఉంటారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీల విషయంలో గవర్నర్లు చండశాసనుల్లాగా బెట్టు చూపిస్తారు. తెలంగాణలో జరిగింది ఇదే, తమిళనాడులో కూడా ఇదే జరుగుతోంది. అయితే అక్కడి స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఎక్కువకాలం నిలువరించలేకుండా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ విషయంలో తమిళనాడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కొణతం దిలీప్ ట్వీట్ చేశారు. గవర్నర్ల వ్యవహారంపై మండిపడుతూ ఆ ట్వీట్ కి తనదైన వ్యాఖ్యానం జోడించారు మంత్రి కేటీఆర్.

First Published:  11 April 2023 6:56 AM GMT
Next Story