Telugu Global
Telangana

పవర్‌ఫుల్‌ లీడర్‌.. పవర్‌ఫుల్ తెలంగాణ - కేటీఆర్‌

2014లో తెలంగాణ విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉండేదన్నారు. 2023 మే నాటికి అది 18,567 మెగావాట్లకు చేరుకుందని.. త్వరలోనే 25 వేల మెగావాట్ల స్థాయికి చేరుకుంటుందన్నారు.

పవర్‌ఫుల్‌ లీడర్‌.. పవర్‌ఫుల్ తెలంగాణ - కేటీఆర్‌
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ అంశం ప్రధానంగా మారింది. తాజాగా ఇదే అంశంపై ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. 9 ఏళ్ల కాలంలో తెలంగాణ విద్యుత్‌ రంగంలో సాధించిన పురోగతిని అంశాల వారీగా వివరించారు. కేసీఆర్ నిబద్ధత, ప్రణాళిక కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణ విద్యుత్‌ రంగం ఓ అధ్యాయమన్నారు కేటీఆర్. ఇందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు.

తెలంగాణ విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలను లెక్కలతో సహా వివరించారు మంత్రి కేటీఆర్. 2014లో తెలంగాణ విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్లుగా ఉండేదన్నారు. 2023 మే నాటికి అది 18,567 మెగావాట్లకు చేరుకుందని.. త్వరలోనే 25 వేల మెగావాట్ల స్థాయికి చేరుకుంటుందన్నారు. 2014-15లో సోలార్ పవర్‌ 74 మెగావాట్లుగా ఉంటే.. 2023 మే నాటికి అది రాకెట్ వేగంతో 5,347 మెగావాట్లకు పెరిగిందన్నారు. తలసరి వినియోగం 1,196 యూనిట్ల నుంచి 2,140 యూనిట్లకు పెరిగిందన్నారు. జాతీయ సగటుతో పోల్చితే ఇది 70 శాతం ఎక్కువన్నారు కేటీఆర్.


దీర్ఘకాలిక, మధ్య కాలిక, స్వల్ప కాలిక ప్రణాళికలతో ఈ అద్భుతాలను కేసీఆర్ సుసాధ్యం చేశారన్నారు కేటీఆర్. విద్యుత్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 27 లక్షల 50 వేల వ్యవసాయం మోటార్లకు ఉచిత్ విద్యుత్ అందించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 50 యూనిట్లు ఫ్రీగా పవర్ అందిస్తున్నామన్నారు. వీటికి అదనంగా సెలూన్లు, దోబీ ఘాట్‌, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

2023 మార్చిలో 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను సైతం తెలంగాణ సక్సెస్‌ఫుల్‌గా అందుకుందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌గా మార్చామన్నారు కేటీఆర్‌. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నది సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పమని చెప్పారు కేటీఆర్. ఈ నిర్ణయాలే తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయన్నారు.

First Published:  16 Nov 2023 3:41 PM GMT
Next Story