Telugu Global
Telangana

మోదీ కర్ణాటకకే ప్రధానా..? మొత్తం దేశానికా..? ప్రధాని ద్వంద్వ వైఖరిపై ప్రశ్నించిన మంత్రి కేటీఆర్

కర్ణాటకలో మాదిరిగా ఇతర రాష్ట్రాలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు, పాలు ఎందుకు ఇవ్వరని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ తన మిత్రుడు, పారిశ్రామికవేత్త గౌతం అదానీకి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను అప్పగించడమే కాకుండా...జీఎస్టీని కూడా మినహాయించారని ఆరోపించారు.

మోదీ కర్ణాటకకే ప్రధానా..? మొత్తం దేశానికా..?  ప్రధాని ద్వంద్వ వైఖరిపై ప్రశ్నించిన మంత్రి కేటీఆర్
X

కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీ ఉచితాలను ప్రకటించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నరేంద్ర మోదీ ఒక్క కర్ణాటక రాష్ట్రానికే ప్రధానా..? లేక మొత్తం దేశానికా..? అని ప్రశ్నించారు. కర్ణాటకలో మాదిరిగా ఇతర రాష్ట్రాలకు ఉచిత గ్యాస్ సిలెండర్లు, పాలు ఎందుకు ఇవ్వరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడు, పారిశ్రామికవేత్త గౌతం అదానీకి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను అప్పగించడమే కాకుండా...జీఎస్టీని కూడా మినహాయించారని ఆరోపించారు. సామాన్యుడి పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు కొంటే జీఎస్టీ భారం వేస్తున్నారని విమర్శించారు. మోదీ ఉచితాలపై చాలా గట్టిగా మాట్లాడతారని...ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో ఓడించి సరైన గుణపాఠం చెబుతారన్నారు మంత్రి కేటీఆర్.

అకాల వర్షాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. సరిపడ నీళ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాలు ఉండడంతో పెద్ద ఎత్తున పంట సాగు జరిగిందని...అయితే అకాల వర్షాలు రైతుల ఆశలను వమ్ము చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో రైతులను అన్ని రకాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ అంటే భారతీయ రైతు సమితి కూడా అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 7.5 లక్షల టన్నుల వరిని సేకరించినట్టు వెల్లడించారు. గత ఏడాది ఇదే సీజన్‌లో 4 లక్షల టన్నులను సేకరించినట్టు మంత్రి గుర్తు చేశారు. పంట నష్టం అంచనా పూర్తయ్యిందని, త్వరలోనే బాధిత రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

First Published:  2 May 2023 5:12 PM GMT
Next Story