Telugu Global
Telangana

ఈనెల 7న చేనేత దినోత్సవం.. సంబరాలకు కేటీఆర్ పిలుపు

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు నిర్వ‌హిస్తామన్నారు మంత్రి కేటీఆర్. 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుందన్నారు.

ఈనెల 7న చేనేత దినోత్సవం.. సంబరాలకు కేటీఆర్ పిలుపు
X

ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారితో పంచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు వారి ప్రాంతాల్లో ఉన్న నేతన్నలతో జాతీయ చేనేత దినోత్సవాల్లో పాల్గొనాలని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో చేనేత వారోత్సవాలు నిర్వ‌హిస్తామన్నారు మంత్రి కేటీఆర్. 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుందన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 7500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ ఏడాది నుంచి చేనేత మిత్ర కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు కేటీఆర్. ప్రస్తుతం ఉన్న పిట్ లూమ్స్ ని ఫ్రేమ్ లూమ్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. హైదరాబాద్ లోని శిల్పారామంలో చేనేత హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం, ఉప్పల్ బగాయత్ లో కన్వెన్షన్ సెంటర్ కు శంకుస్ధాపన చేస్తామని తెలిపారు.

చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా నూతన రాష్ట్రంలో ఏడాదికి రూ.1200 కోట్ల చొప్పున ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నామని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. మగ్గాలను జియో ట్యాగ్ చేసి, చేనేత మిత్ర పథకం అమలు చేశామని, నూలు, రసాయనాల కొనుగోలుకి 50శాతం రాయితీ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 22 వేల మంది నేతన్నలకు సుమారు రూ.90 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామన్నారు. రైతు బీమాలాగా నేతన్న బీమా అమలు చేస్తున్నామని, నేతన్నలు పొదపు చేసే మొత్తానికి ప్రభుత్వం కూడా తమ వాటా జమ చేస్తోందని వివరించారు.

చేనేత కళ అంతరించి పోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో TSCO ద్వారా డిజైన్లు, వస్త్రోత్పత్తిని పరిశోధనలో భాగం చేశామన్నారు మంత్రి కేటీఆర్. “పీతాంబరి పట్టు చీరలు”, “ఆర్మూరు పట్టు చీరలు”, “హిమ్రా చేనేతలు”, “సిద్ధిపేట గొల్లభామ చీరలు”, “మహాదేవపూర్ టస్సర్ పట్టుచీరల” వంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి, తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం గర్వకారణం అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా చేనేత పథకాల విషయంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. ఈ ఏడాది చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

First Published:  5 Aug 2023 9:48 AM GMT
Next Story