Telugu Global
Telangana

ఇంటింటా ఇన్నోవేటర్.. బస్సులో భరోసా

'బస్సులో భరోసా' పేరుతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు.

ఇంటింటా ఇన్నోవేటర్.. బస్సులో భరోసా
X

స్వాతంత్ర దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్ వివిధ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు మంత్రి కేటీఆర్.


ఇంటింటా ఇన్నోవేటర్..

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా నిర్వహిస్తున్న 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మంత్రి కేటీఆర్. రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా అన్ని వర్గాలలో.. సృజనాత్మకతను వెలికి తీసి వారి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, హన్మాజీపేట్, దమ్మన్నపేట్ హైస్కూల్ విద్యార్థినులు వారి ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఆ ఆవిష్కరణలను పరిశీలించి, వాటి పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. తమ సృజనాత్మకతకు పదును పెట్టిన విద్యార్థినులను అభినందించారు.


బస్సులో భరోసా..

మహిళా భద్రతకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం 'బస్సులో భరోసా'. జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, స్కూల్ బస్సుల్లో ప్రయాణించే పిల్లల భద్రతకోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఫిర్యాదు రాకపోయినా, అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు. 'బస్సులో భరోసా' పేరుతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు.



First Published:  15 Aug 2023 1:12 PM GMT
Next Story