Telugu Global
Telangana

మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్‌

అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. వరుసగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది.

మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్‌
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇక అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. వరుసగా ఎమ్మెల్యే టికెట్ల విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ కూడా ఫోకస్‌ పెంచారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ప్రస్తుత ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి 70 వేల ఓట్ల మెజారిటీతో సురేందర్‌ను గెలిపించాలని కోరారు.

గతంలోనూ పలు నియోజకవర్గాల అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. వరంగల్‌లో పర్యటించిన సందర్భంగా వరంగల్ పశ్చిమం నుంచి పోటీ చేసేది దాస్యం వినయ్ భాస్కరేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. ఈసారి రికార్డు మెజార్టీ ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక గతంలో బాన్సువాడలో పర్యటించిన సందర్భంగా.. మరోసారి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పోటీ చేస్తారని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటలపైనా పోటీ చేసే అభ్యర్థినీ మంత్రి కేటీఆర్ తేల్చేశారు. హుజురాబాద్‌ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్‌ రెడ్డిని బరిలో నిలుపుతామని చెప్పారు. ఇక హుస్నాబాద్‌ అభ్యర్థిని సైతం మంత్రి కేటీఆర్ ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వొడితెల సతీష్‌ కుమార్‌ బరిలో ఉంటారని తేల్చేశారు. అదే సభలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. బోయినపల్లి వినోద్‌ కుమార్ ఈ సారి కూడా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పారు.

ఇటీవల భువనగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడిన కేటీఆర్‌.. మరోసారి పైళ్ల శేఖర్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వీటితో పాటు అచ్చంపేటకి గువ్వల బాలరాజు, దేవరకద్రకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గానికి సండ్ర వెంకటవీరయ్య, నిజామాబాద్ అర్బన్‌కు గణేష‌ గుప్తా, బోధన్‌కు షకీల్ అహ్మద్‌, కూకట్‌పల్లి నియోజకవర్గానికి మాధవరం కృష్ణారావులను అభ్యర్థులుగా ప్రకటించింది బీఆర్ఎస్‌.

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ స్వయంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఈసారి మాత్రం కాస్త భిన్నంగా మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా పార్టీ కేడర్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందన్న భావనలో బీఆర్ఎస్ ఉంది. అయితే స్ట్రాటజీ ఏదైనా.. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం కాస్త టెన్షన్ కనిపిస్తోంది. తమకు టికెట్ వస్తుందా.. లేదా.. అనే ఉత్కంఠతో ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే 80 మందికిపైగా అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

First Published:  14 Aug 2023 11:45 AM GMT
Next Story