Telugu Global
Telangana

కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌తో వీళ్ల గుండెల్లో గుబులు.. ఏంటా క‌థ‌?

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ రేపో, మాపో అభ్య‌ర్థుల లిస్ట్ ప్ర‌క‌టిస్తార‌ని తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లు యూట్యూబ్ ఛాన‌ళ్ల స్థాయిని దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా వ‌చ్చాయి.

కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న‌తో వీళ్ల గుండెల్లో గుబులు.. ఏంటా క‌థ‌?
X

తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ వారం రోజుల‌పాటు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. శనివారం బ‌య‌ల్దేరి వెళ్లిన ఆయ‌న న్యూయార్క్‌, చికాగో త‌దిత‌ర న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తారు. అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌లు, వివిధ సంస్థ‌ల య‌జ‌మానుల‌ను క‌లిసి తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆహ్వానిస్తారు. మ‌రోవైపు త‌న కుమారుడు హిమాన్షును అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ కోర్సులో చేర్పించే కార్య‌క్రమానికీ మంత్రి హాజ‌రుకానున్నారు. అయితే కేటీఆర్ వారం రోజుల ప‌ర్య‌ట‌న‌తో సొంత పార్టీ బీఆర్ఎస్ నేత‌ల్లోనే గుబులు మొద‌లైంది.

ఎందుకంత భ‌యం?

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేసీఆర్ రేపో, మాపో అభ్య‌ర్థుల లిస్ట్ ప్ర‌క‌టిస్తార‌ని తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లు యూట్యూబ్ ఛాన‌ళ్ల స్థాయిని దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా వ‌చ్చాయి. సోమ‌వారం లిస్ట్ ప్ర‌క‌టిస్తార‌ని బ‌లంగా ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ అందుబాటులో లేక‌పోతే ఎలా అని నేత‌లు మ‌థ‌న‌ప‌డుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వ‌ద్ద‌ని ప‌ట్టుబ‌డుతున్న నేత‌లు, త‌మ‌కు ఈసారి కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని పోరాడుతున్న ఎమ్మెల్యేలు అంద‌రూ కేటీఆర్ దృష్టిలో ప‌డాల‌ని కోరుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న దృష్టికి, సీనియ‌ర్ నేత‌, మంత్రి హ‌రీష్‌రావు దృష్టికి త‌మ వాద‌న‌ను తీసుకెళుతున్నారు.

తేడా వ‌స్తే ఏం చేయాలి?

ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ అమెరికాలో ఉండ‌గానే లిస్ట్ వెల్ల‌డైపోతే.. అందులో తాము అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌క‌పోతే ప‌రిస్థితి ఏంట‌న్న ఆలోచ‌న‌ల‌తో వారి ధ‌మాక్ ఖ‌రాబ‌వుతోంది. ఆయ‌న్నే న‌మ్ముకున్నామ‌న్నా.. ఏదైనా తేడా వ‌స్తే ఎవ‌రికి చెప్పుకోవాలంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఆయ‌న వ‌చ్చేవ‌ర‌కూ లిస్ట్ ప్ర‌క‌ట‌న లాంటిది ఏమీ లేకుండా ఉండాల‌ని కోరుకుంటున్నారు.

First Published:  20 Aug 2023 5:16 AM GMT
Next Story