Telugu Global
Telangana

తెలుగు వాళ్లం తెలుగులోనే మాట్లాడదాం -కేటీఆర్

తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తక్కువ అవుతోందన్నారు.

తెలుగు వాళ్లం తెలుగులోనే మాట్లాడదాం -కేటీఆర్
X

తెలంగాణలో చెరువుల పరిరక్షణకు పలు నిర్మాణ కంపెనీలు ముందుకొచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో చెరువుల దత్తతకు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు ఆసక్తిర అంశాలు చోటు చేసుకున్నాయి. తెలుగు భాష విషయంలో మంత్రి కేటీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. కేటీఆర్ కంటే ముందు క్రెడాయ్ ప్రెసిడెంట్, రెడ్కో ప్రెసిడెంట్ ఇద్దరూ ఇంగ్లిష్ లో ప్రసంగించారు. అయితే అక్కడ ఉన్నవారంతా తెలుగువారే కావడంతో మంత్రి కేటీఆర్ మాత్రం తెలుగులోనే ప్రసంగించారు. కనీసం తెలుగు వాళ్ల మధ్యలో అయినా తెలుగులో మాట్లాడుకుందాం అని అందరికీ సూచించారు.


తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తక్కువ అవుతోందన్నారు. రాను రాను తెలుగోళ్లు కూడా తెలుగులో మాట్లాడకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే దఫా మీటింగ్ లో తెలుగు వారి మధ్య అందరం తెలుగులోనే మాట్లాడుకుందామన్నారు మంత్రి కేటీఆర్.

అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ 7వేల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్దదిగా ఎదిగిందని చెప్పారు కేటీఆర్. గతంలో అమరావతిని వైశాల్యపరంగా పెద్దదిగా చూపించారని, ఇప్పుడక్కడ కార్యక్రమాలేవీ జరగడంలేదని, కాబట్టి హైదరాబాదే పెద్దదని చెప్పారు. సమావేశంలో ఉన్నవారు గుంటూరు గురించి ప్రస్తావించడంతో గుంటూరు కూడా బాగానే ఉందని చెప్పారు కేటీఆర్. గతంలో కూడా క్రెడాయి మీటింగ్ లో ఎవరో ప్రెండ్ అన్న మాటల్ని గుర్తు చేస్తే, మీడియా మాత్రం రోజంతా చూపించిందంటూ చెణుకులు విసిరారు. ఏపీలో గుంటూరు, వైజాగ్, విజయవాడ, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్.

First Published:  28 March 2023 2:06 PM GMT
Next Story