Telugu Global
Telangana

వేర్ ఈజ్ ఈసీ, ఈడీ, ఐటీ..? కేటీఆర్ సూటి ప్రశ్న

ఆయన చేసిన ఆరోపణలను ఈడీ, ఐటీ వంటి సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై కనీసం ఈసీ అయినా స్పందించదా అని అడిగారు.

వేర్ ఈజ్ ఈసీ, ఈడీ, ఐటీ..? కేటీఆర్ సూటి ప్రశ్న
X

విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దూకుడు అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా మాత్రం ఈడీ, ఐటీకి కనిపించదు. ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడినా ఈసీ లైట్ తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి అంటూ సాక్షాత్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తే ఈడీ, ఐటీ ఎక్కడికి పోయాయని, భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ట్విట్టర్లో నిలదీశారు మంత్రి కేటీఆర్. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆడియోని తన ట్వీట్ కి జతచేశారు.


మునుగోడు ఎన్నికల్లో బీజేపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అటు రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ లు ఆశ చూపి రాజీనామా చేయించారు. 100 కోట్ల రూపాయలు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపుకోసం కేటాయించారు. కానీ బీజేపీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటినుంచి వారికి అన్నీ ఎదురు దెబ్బలే. ఇటీవల కర్నాటక అసెంబ్లీలో ఘోర పరాజయం తర్వాత బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

నిజాలు ఒప్పుకున్న రఘునందన్ రావు..

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు విషయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్ని నిజాలు బయటపెట్టారు. దుబ్బాకలో తాను పువ్వు గుర్తు వల్ల గెలవలేదని, తన ఇమేజ్ తనను కాపాడిందని చెప్పారు. పువ్వు గుర్తుకి అంత బలం ఉంటే మునుగోడులో కూడా అదే మేజిక్ రిపీట్ కావాలి కదా అని లాజిక్ తీశారు. ఈ క్రమంలో ఆయన అదిష్టానంపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మునుగోడులో బీజేపీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అదే డబ్బు తనకి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా వెదజల్లేవాడినని పార్టీ బలం పెంచేవాడినని చెప్పుకున్నారు. మునుగోడులో పార్టీ ఖర్చు చేసిన 100 కోట్ల రూపాయలు వృథా అయ్యాయని కూడా అన్నారు రఘునందన్ రావు.

రఘునందన్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారడంతో ఆయన తెరమరుగయ్యారు. అధిష్టానం వార్నింగ్ కూడా బాగానే పనిచేసినట్టుంది, ఇటీవల ఆయన గొంతు మూగబోయంది. అయితే ఆయన చేసిన ఆరోపణలను ఈడీ, ఐటీ వంటి సంస్థలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై కనీసం ఈసీ అయినా స్పందించదా అని అడిగారు. బీజేపీకి నోటీసులయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అవినీతి గురించి మోదీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు కేటీఆర్.

First Published:  9 July 2023 10:07 AM GMT
Next Story