Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్.. రెండిటికీ మేము దూరం -కేటీఆర్

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. కేంద్రం, రాష్ట్ర హక్కులను కాలరాయాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.

బీజేపీ, కాంగ్రెస్.. రెండిటికీ మేము దూరం -కేటీఆర్
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో విపక్షాల సమావేశం జరుగుతున్న వేళ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలకు దూరం అని క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు పార్టీలు దేశానికి తీరని నష్టం చేశాయన్నారు. అందుకే తాము రెండు పార్టీలకు వ్యతిరేకమన్నారు. పాట్నా సమావేశానికి బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉందనే విషయానికి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.

బలహీన ప్రధాని మోదీ..

స్వాతంత్య్ర భారత దేశంలో అత్యంత బలహీన ప్రధానమంత్రి మోదీ అని విమర్శించారు మంత్రి కేటీఆర్. మోదీ హయాంలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయని, అయినా ఆయనకు వాటిని నియంత్రించడం చేతకాలేదున్నారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదని, పిరమైన ప్రధాని అని గతంలో పలుమార్లు విమర్శించారు కేటీఆర్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తుందని కూడా మంత్రి కేటీఆర్ విమర్శించేవారు. ప్రధాని మోదీ అత్యంత బలమైన వ్యక్తిగా బీజేపీ ప్రొజెక్ట్ చేసుకుంటున్న వేళ, ఆయన అత్యంత బలహీన ప్రధాని అని ఎద్దేవా చేశారు కేటీఆర్.

హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు..

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. కేంద్రం, రాష్ట్ర హక్కులను కాలరాయాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కేటీఆర్. ఉభయ సభల్లో ఆ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామన్నారు. కాంగ్రెస్ కేంద్రంగా పాట్నా నుంచి విపక్ష పార్టీలు బీజేపీపై యుద్ధ భేరి మోగిస్తున్న వేళ, ఆ కూటమితో బీఆర్ఎస్ కలవబోదంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.

First Published:  23 Jun 2023 10:08 AM GMT
Next Story