Telugu Global
Telangana

మమ్మల్ని టచ్ చేసి చూడండి.. కోమటిరెడ్డి హెచ్చరిక

మీ పార్టీని లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ వాళ్లు, మీ పార్టీని మీరే నాశనం చేసుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

మమ్మల్ని టచ్ చేసి చూడండి.. కోమటిరెడ్డి హెచ్చరిక
X

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రలోభాలకు లొంగిపోయారా, లేక ఇంకేదైనా గట్టి హామీలున్నాయా అనేది వారి అంతర్గత వ్యవహారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విచిత్రమైన ఆరోపణలు తెరపైకి రావడం విశేషం. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్టు ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అయితే ఎవరితో సంప్రదింపులు జరిగాయి, ఎలా మంతనాలు నడిచాయనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించకపోవడం విశేషం.

ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనం అవుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, అందుకే వారు తమ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెబుతున్నారని అన్నారు. తమను టచ్‌ చేసి చూడాలని సవాల్ విసిరారు కోమటిరెడ్డి.

కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను పునాదులతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు మంత్రి కోమటిరెడ్డి. 3 నెలల్లోనే ఆ పార్టీ దుకాణం బంద్‌ అవుతుందని.. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. 12 నుంచి 13 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్‌రూమ్‌ అంటూ గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేశారు కోమటిరెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. లోక్ సభ ఎన్నికల నాటికి అవి మరింత ముదిరాయి. మీ పార్టీని లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ వాళ్లు, మీ పార్టీని మీరే నాశనం చేసుకుంటారంటూ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

First Published:  17 April 2024 8:37 AM GMT
Next Story