Telugu Global
Telangana

రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. అంతా బీజేపీ కుట్ర..

రాజాసింగ్ సస్పెన్షన్ పెద్ద డ్రామానే అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి, అభివృద్ధి నిలువరించాలన్నదే బీజేపీ అజెండా అని విమర్శించారాయన.

రాజాసింగ్ సస్పెన్షన్ ఓ డ్రామా.. అంతా బీజేపీ కుట్ర..
X

ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన తప్పుకి బీజేపీ అంత సీరియస్ గా, అంత త్వరగా రియాక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ బీజేపీ అధిష్టానం వెంటనే సస్పెన్షన్ లెటర్ పంపించింది, ఆయన వివరణ అడిగింది. అంత మాత్రాన పాప ప్రక్షాళన‌ జరిగినట్టు కాదు. కచ్చితంగా బీజేపీ ఏదో పెద్ద డ్రామా ఆడుతుందనే అనుమానం కూడా అందరిలో బలపడింది. అవును, అది పెద్ద డ్రామానే అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి, అభివృద్ధి నిలువరించాలన్నదే బీజేపీ అజెండా అని విమర్శించారాయన.

పథకం ప్రకారమే..

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి, టీఆర్ఎస్ క్యాడర్‌ ని రెచ్చగొట్టాలన్నదే బీజేపీ వ్యూహమని, ప్రతీకార దాడులు జరిపించుకోవాలన్నదే ఆ పార్టీ పథకమని అన్నారు జగదీష్ రెడ్డి. ప్రతీకార దాడులు చేయించుకొని, దాన్ని సింపతీగా వాడుకోవాలని బీజేపీ చూస్తోందని అభిప్రాయపడ్డారు. ఆరోపణలు చేసేది వారే, దాడులకు దిగేది వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో కవిత హస్తం ఉందని చట్టబద్ధ‌ సంస్థలు ఎక్కడా ప్రకటించలేదని, ఇదంతా బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ సృష్టించిన రాద్ధాంతమని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్ని నిలువరించి, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు జగదీష్ రెడ్డి. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ ను సస్పెండ్ చేసిన వ్యవహారం కూడా ఒక డ్రామానే అని అన్నారు. రాజాసింగ్ తనకు న్యాయం జరుగుతుందని చెప్పడం, సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేయడం, సరైన వివరణ ఇస్తానని చెప్పడం కూడా ఈడ్రామాలో భాగమేనన్నారు. సింపతీకోసం డ్రామాలాడుతున్నారని, అల్లర్లు సృష్టించేందుకు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారని జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ పన్నుతున్న కుట్రల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.

First Published:  24 Aug 2022 2:26 PM GMT
Next Story