Telugu Global
Telangana

కాంగ్రెస్ వస్తే కోతలు, వాతలే.. - మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపాటు

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌లో 6 గంటలే ఇస్తున్నారని, ఇక ఉత్తరప్రదేశ్‌లో కరెంట్ లేని గ్రామాలు అనేకం ఉన్నాయని చెప్పారు.

కాంగ్రెస్ వస్తే కోతలు, వాతలే.. - మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపాటు
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. 8 గంటల విద్యుత్ సరఫరానే కాంగ్రెస్ రహస్య ఎజెండా అని.. 24 గంటల విద్యుత్ విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని చెప్పారు. అదే నిజమైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ 7 గంటలే ఇస్తున్నారని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన రైతు సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. విద్యుత్ సరఫరాపై ఏఐసీసీ నిర్ణయాన్ని బుడ్డర్ ఖాన్‌లు, పేపర్ పులులు బహిర్గతం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌లో 6 గంటలే ఇస్తున్నారని, ఇక ఉత్తరప్రదేశ్‌లో కరెంట్ లేని గ్రామాలు అనేకం ఉన్నాయని చెప్పారు. 2014లో తెలంగాణలో గులాబీ జెండా ఎగ‌ర‌క‌పోయి ఉంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదన్నారు.

కాంగ్రెస్ మాటలు నమ్మి జరగకూడనిది జరిగితే ఆసరా పింఛ‌న్ రూ.200కు కుదింపు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు మంగళం పాడతారని, రైతు బంధు, రైతు బీమాలను ఎత్తివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే కుట్రలు కాంగ్రెస్ ద్వారా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపున‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

First Published:  20 July 2023 11:34 AM GMT
Next Story