Telugu Global
Telangana

అమిత్ షా అబ‌ద్ధాల‌నే కిష‌న్‌రెడ్డి రిపీట్ చేశారు.. - పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై హ‌రీశ్‌రావు

ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో కేవ‌లం 30 శాతం మాత్రమే పొందుతున్నాయని గుర్తుచేశారు.

అమిత్ షా అబ‌ద్ధాల‌నే కిష‌న్‌రెడ్డి రిపీట్ చేశారు.. - పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌పై హ‌రీశ్‌రావు
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి రిపీట్ చేశారని మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఆయ‌న శ‌నివారం స్పందించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1.43 లక్షల కోట్లు వెంటనే విడుదల చేయించాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. పన్నుల పంపిణీ అనేది రాష్ట్రాల రాజ్యాంగ హక్కు అని, దేశ‌ కన్సాలిడేటెడ్ ఫండ్‌లో అది భాగం కాదని ఆయ‌న చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర పన్నుల్లో అన్ని రాష్ట్రాల వాటా 41 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్రాలు కేంద్ర పన్నుల్లో కేవ‌లం 30 శాతం మాత్రమే పొందుతున్నాయని గుర్తుచేశారు.

కేంద్రం నిధులు మిష‌న్ భ‌గీరథ నిర్వ‌హ‌ణ‌కు కూడా స‌రిపోవు..

కేంద్ర వాటాగా రూ.1588.08 కోట్లతో తెలంగాణలో 100 శాతం ఇళ్లకు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేసిన‌ట్టు కిషన్ రెడ్డి చెప్ప‌డంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మిషన్ భగీరథ కింద రూ.36వేల కోట్లు వెచ్చించి 100 శాతం గృహాలకు నీటిసరఫరా చేసిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేంద్రం ఇస్తున్న మొత్తం మిషన్ భగీరథ నిర్వహణకు కూడా సరిపోదని చెప్పారు. తెలంగాణ నుంచి 2017-18 నుంచి 2022-23 వరకు జీఎస్టీ పరిహారం సెస్ రూ. 34,737 కోట్లు వసూలు చేశారని, కానీ తెలంగాణకు దక్కింది కేవలం రూ.8,927 కోట్లు మాత్రమేనని వివరించారు.

జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదటి రెండేళ్లలో పరిహారంగా వచ్చింది రూ.169 కోట్ల మాత్రమేనని హరీష్ రావు తెలిపారు. ఈ రెండేళ్లలో తెలంగాణ నుంచి వసూలైన జీఎస్టీ సెస్ రూ.10,285 కోట్లని వెల్లడించారు. పరిహారం మొత్తం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాలేదు కానీ, జీఎస్టీ పరిహార నిధి నుంచి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిహారం చెల్లించిందన్న వాదన సరికాదని, అది తమ హక్కు అని తెలిపారు.

ఆ నిధులు కిష‌న్‌రెడ్డి మెహ‌ర్బానీతో రాలేదు..

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం ఐదేళ్ల కాలానికి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసింది రూ.2,250 కోట్లని హ‌రీశ్‌రావు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చట్ట ప్రకారం ఉన్న 2019-20, 2020-21, 2022-23 సంవత్సరాలకు ఎటువంటి మొత్తం విడుదల కాలేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఈ మూడేళ్లకు గాను రూ.1350 కోట్లు ఎలాంటి కారణం లేకుండా నిలుపుదల చేసింద‌ని చెప్పారు. దీనిపై కిషన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జాతీయ రహదారులకు కేటాయింపులు రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్ నుంచి జరుగుతాయని, కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ ఉండదని తెలిపారు. తెలంగాణకు కేటాయించిన నిధులు కిషన్‌రెడ్డి మెహర్బానీతో రాలేదని హ‌రీశ్‌రావు చెప్పారు.

First Published:  18 Jun 2023 3:50 AM GMT
Next Story