Telugu Global
Telangana

మహారాష్ట్రకు హరీష్ రావు.. షోలాపూర్ లో నేడు భారీ ర్యాలీ

మార్కండేయ రథోత్సవంలో పాల్గొంటున్న నాయకులు.. పనిలో పనిగా బీఆర్ఎస్ త్వరలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా పరిశీలిస్తారు. షోలాపూర్ లో ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు.

మహారాష్ట్రకు హరీష్ రావు.. షోలాపూర్ లో నేడు భారీ ర్యాలీ
X

జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్, తెలంగాణతో 1000 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు మహారాష్ట్రకి వెళ్లారు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు, రాజకీయ శిక్షణ తరగతులకు కూడా హాజరై అక్కడి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన ప్రయత్నానికి తగ్గట్టే మహారాష్ట్రలో పేరున్న నాయకులు చాలామంది బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టడం, వారి అభద్రతా భావానికి నిదర్శనం. ఇటు తెలంగాణ ఎన్నికలకు సమాయత్తమవుతూనే అటు మహారాష్ట్రలో వివిధ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు హాజరవుతున్నారు, తమ ఉనికి చాటుకుంటున్నారు. ఈరోజు షోలాపూర్ లో జరగబోతున్న మార్కండేయ రథోత్సవానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

మహారాష్ట్రలో పద్మశాలి వర్గీయులు ఆరాధ్య దైవం మార్కండేయ రథోత్సవం ఘనంగా జరుగుతుంది. వీరిలో చాలామంది తెలంగాణ నుంచి వలస వెళ్లి అక్కడ నివశిస్తున్నవారే, రాజకీయంగా కూడా అక్కడ వీరికి ప్రాబల్యం ఉంది. గతంలో వివిధ పార్టీల్లో విస్తరించిన పద్మశాలీయులు.. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత గులాబి కండువాలు కప్పుకున్నారు. ఈ ఏడాది మార్కండేయ రథోత్సవానికి బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జ్ కల్వకుంట్ల వంశీధర్ రావు కూడా ఈ రథోత్సవంలో పాల్గొంటారు.

బీఆర్ఎస్ సత్తా..

మార్కండేయ రథోత్సవంలో పాల్గొంటున్న నాయకులు.. పనిలో పనిగా బీఆర్ఎస్ త్వరలో నిర్వహించే బహిరంగ సభ స్థలాన్ని కూడా పరిశీలిస్తారు. షోలాపూర్ లో ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారు. జులై 9న 300 మంది నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ ఇటీవల నాగ్‌ పూర్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించడం, పండర్‌ పూర్, తుల్జాపూర్‌ లో ఆయన పర్యటనలకు కూడా స్థానికులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. షోలాపూర్ లో ప్రధాన పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ సైన్యాన్ని సమకూర్చుకుంటోంది. మహారాష్ట్రలో పాగా వేయాలని చూస్తోంది.


First Published:  30 Aug 2023 6:49 AM GMT
Next Story