Telugu Global
Telangana

కాళేశ్వరం మునిగిపోవాలని కోరుకున్నవారి కలలు కల్లలయ్యాయి : మంత్రి హరీశ్ రావు

కాళేశ్వరానికి ఉన్న అనుమతి పత్రాలను ఆయన సభ్యులకు చూపించారు. కేంద్రం ఇచ్చిన అనుమతుల వివరాలన్నింటినీ ఆయన చదివి వినిపించారు. స్వయంగా సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్.. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని అన్నారని హరీశ్ రావు చెప్పారు.

కాళేశ్వరం మునిగిపోవాలని కోరుకున్నవారి కలలు కల్లలయ్యాయి : మంత్రి హరీశ్ రావు
X

మహారాష్ట్ర, తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు తాత్కాలికంగా మునిగిపోయాయి. అయితే, కొంత మంది మాత్రం ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోతే బాగుండు అని కోరుకున్నారు. కాళేశ్వరం మునిగిపోవాలన్న వారి కలలు కల్లలయ్యాయి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈ నెలలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా నీళ్లిస్తాము. యాసంగి పంటకు ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరందించి అందరి నోర్లు మూయిస్తామని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన మండలిలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అతివృష్టి, గోదావరి పరివాహక ప్రాంతాల పరిస్థితిపై మాట్లాడుతూ.. కాళేశ్వరం గురించి పలు విషయాలు వెల్లడించారు.

కాళేశ్వరానికి ఉన్న అనుమతి పత్రాలను ఆయన సభ్యులకు చూపించారు. కేంద్రం ఇచ్చిన అనుమతుల వివరాలన్నింటినీ ఆయన చదివి వినిపించారు. స్వయంగా సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్.. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని అన్నారని హరీశ్ రావు చెప్పారు. నీటిపారుదల రంగం విషయంలో తెలంగాణ నుంచి నేర్చుకోవడానికే ఇక్కడకు వచ్చానని ఆయన అన్న మాటలను గుర్తు చేశారు. బీజేపీ నిత్యం ఈ ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం చేస్తోంది. అయితే స్వయంగా బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తోన్న దుబ్బాక నియోజకవర్గంలో కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని ఆయన చెప్పారు. ఈ విషయం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కూడా తెలుసని హరీశ్ అన్నారు.

ప్రస్తుతం రాజకీయాలు చాలా దిగజారాయని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరదలు వస్తే రాజకీయ నాయకులు అందరూ కలసి ప్రభుత్వానికి సాయం చేసేవారు. కానీ, ఇప్పుడు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రతిపక్షాలకు మాత్రం రాజకీయాలే కావలసి వచ్చింది. కాళేశ్వరం మునిగిపోతోందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని అనవసరమైన ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని నిరూపించడానికి ప్రతిపక్షాలు పోటీ పడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్లందరూ కాళేశ్వరం పూర్తి కావొద్దని కోరుకున్న వాళ్లే అని మండిపడ్డారు.

అన్నారం పంప్ హౌస్ నుంచి ఈనెల మూడో వారంలో నీళ్లు వస్తాయి. మేడిగడ్డ పంప్ హౌస్‌కు వచ్చే నెలలో నీరు ఇస్తాం. కాళేశ్వరం వచ్చాక ఏడాదికి రెండు పంటలు పండిస్తున్న విషయం వాస్తవం కాదా అని ఆయన అన్నారు. కాళేశ్వరం కారణంగానే 2.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందని హరీశ్ రావు చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఎంతో డబ్బును ఆదా చేశాం. జీడీపీని పెంచుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పెరిగాయని హరీశ్ స్పష్టం చేశారు.

ఓ కేంద్ర మంత్రి కాళేశ్వరానికి డీపీఆర్ లేదని, మరో కేంద్ర మంత్రి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా పొలానికి కూడా నీళ్లు పారలేదని అబద్దపు ప్రచారాలు చేశారు. డీపీఆర్ లేకుంటే కాళేశ్వరానికి సీడీబ్ల్యూసీ 10 అనుమతులు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. డీపీఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు ఇచ్చింది కేంద్రమే అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాణేశ్వరం.. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణకు శనీశ్వరంలా దాపురించాయని అన్నారు.

First Published:  6 Sep 2022 12:26 PM GMT
Next Story