Telugu Global
Telangana

మనుషుల్ని కొనొచ్చు కానీ.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనలేరు

30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారని చెప్పారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ద్రోహులు కేసీఆర్ కు సాటి వస్తారా? అని ప్రశ్నించారు.

మనుషుల్ని కొనొచ్చు కానీ.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనలేరు
X

మనుషుల్ని కొనొచ్చు కానీ.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనలేరు

ఎన్నికల వేళ కొంత మంది డబ్బులకు అమ్ముడు పోతున్నారని.. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారని చెప్పారు మంత్రి హరీష్ రావు. తాము అమ్ముడుపోయే మనుషులం కాదని, ప్రజల్ని నమ్ముకునేవారమని అన్నారు. మనుషుల్ని కొనొచ్చు కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేరంటూ ప్రతిపక్షాలకు చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మూటలు, ముఠాలు, మంటలు అని ఎద్దేవా చేశారు హరీష్ రావు. ఆ పార్టీలో ఎవరు పడితే వారు తానే సీఎం అంటున్నారని కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డారని.. బీఆర్‌ఎస్ కి ప్రజలు 88 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు.


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒకరు రైఫిల్ పడితే, మరొకరు రాజీనామా చేయకుండా పారిపోయారని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. తెలంగాణ ద్రోహులుగా ఉన్న వాళ్లు కేసీఆర్ కు సాటిగా వస్తారా? అని ప్రశ్నించారు.

పెన్షన్లు పెంచబోతున్నామని, రైతుబంధు సాయాన్ని వచ్చేసారి రూ.16వేలు చేసుకోబోతున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు. చెడుకు వ్యాప్తి వేగం ఎక్కువని, అందుకే సోషల్ మీడియా వేదికగా కొందరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. కళ్ల ముందు, ఇంటి ముందు కనబడ్డ అభివృద్ధినే నమ్మాలని ప్రజలను కోరాలని నాయకులకు సూచించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గతంలోప్రభుత్వాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే.. సీఎం కేసీఆర్ రైతులకు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు హరీష్ రావు. పక్కనే ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ ని గెలిపించిన రైతుల పరిస్థితి పొయ్యిమీదనుంచి పెనంపై పడినట్టుగా మారిందని.. ప్రజలు ఆలోచించి ఓటు వేసే విధంగా వారిని సిద్ధం చేయాలని చెప్పారు హరీష్ రావు.

First Published:  27 Oct 2023 8:28 AM GMT
Next Story