Telugu Global
Telangana

అలా చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు.. హరీష్ రావు హెచ్చరిక

తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ద్వారా 24 గంటల్లో వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు విపరీతంగా ఉండేవని.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందన్నారు.

అలా చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు.. హరీష్ రావు హెచ్చరిక
X

తెలంగాణలో వైరల్ ఫీవర్లు మొదలయ్యాయి. వారం, పదిరోజులుగా జ్వరాల కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైతే ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు పెరగకుండా చూడాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా, డెంగీలతో ఒక్కరు కూడా మృతి చెందకుండా వైద్య, ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు, కిట్లు అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలన్నారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు మంత్రి.


వైద్య పరీక్షలపై ప్రత్యేక దృష్టి..

తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ద్వారా 24 గంటల్లో వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు విపరీతంగా ఉండేవని.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, మిషన్‌ భగీరథ వంటి పథకాలతో పారిశుధ్యం, మంచినీటి వసతి మెరుగైందని, సీజనల్ వ్యాధుల తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. దోమల నివారణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని.. ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ శాఖ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రి హరీష్ రావు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరుతో భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. ప్లేట్ లెట్స్ పడిపోయాయంటూ లేనిపోని హడావిడి సృష్టిస్తున్నారని, ఒకవేళ రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తే.. చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతున్న కేసులూ తమ దృష్టికి వచ్చాయన్నారు. అలాంటి ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని వెల్‌ నెస్‌ సెంటర్లను తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలించాలని ఆరోగ్యశ్రీ సీఈఓను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

First Published:  27 Sep 2023 3:26 AM GMT
Next Story