Telugu Global
Telangana

రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ కు ఓటుతోనే పోటు పొడవాలి

కాంగ్రెస్‌ పార్టీ.. రైతుల నోటికాడ బుక్కను లాక్కుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. ఓట్ల కోసం తాము రైతుబంధు తీసుకురాలేదని చెప్పారు. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్‌ ఖతమ్‌ కావాలన్నారు.

రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ కు ఓటుతోనే పోటు పొడవాలి
X

తెలంగాణలో రైతుబంధు వ్యవహారం మళ్లీ సంచలనంగా మారింది. అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి కేంద్ర ఎన్నికల సంఘం వెనకడుగు వేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్న తరుణంలో.. అసలు కాంగ్రెస్ పార్టీ వల్లే రైతుబంధు ఆగిందని ఆరోపించారు హరీష్ రావు. రైతుబంధుని ఎన్నిరోజులు ఆపుతారని నిలదీశారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత ఎన్నికల్లో గెలిచి రైతుబంధు పంపిణీ చేస్తామని చెప్పారు హరీష్.


రైతుల నోటికాడ బుక్కను లాక్కున్నారు..

కాంగ్రెస్‌ పార్టీ.. రైతుల నోటికాడ బుక్కను లాక్కుందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. తాను మీటింగ్ లో చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. న్యాయం గెలిచిందని, రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్‌ ఇచ్చిందని మాత్రమే తాను చెప్పానని గుర్తు చేశారు. ఓట్ల కోసం తాము రైతుబంధు తీసుకురాలేదని చెప్పారు. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌ కు ఓటుతోనే పోటు పొడవాలన్నారు హరీష్ రావు. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్‌ ఖతమ్‌ కావాలన్నారు.

తెలంగాణ రైతులతో కేసీఆర్‌ ది పేగుబంధం అని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే పెన్షన్ రూ.5వేలు ఇస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పారు. పేదలకు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామన్నారు. రేషన్‌కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని చెప్పారు హరీష్ రావు.


First Published:  27 Nov 2023 7:57 AM GMT
Next Story