Telugu Global
Telangana

బీఆర్ఎస్ లోకి విష్ణు.. హరీష్ రావు ఇచ్చిన హామీ ఏంటంటే..?

కాంగ్రెస్ ని తమ ఇంటి పార్టీగా భావిస్తూ వచ్చామని కానీ తనకు ఆ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు విష్ణువర్దన్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీ భవన్‌ ను కూడా అమ్మేసేవారు ఉన్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ లోకి విష్ణు.. హరీష్ రావు ఇచ్చిన హామీ ఏంటంటే..?
X

జూబ్లీహిల్స్ సీటు విషయంలో కాంగ్రెస్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. గత రాత్రి ఆయన సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో కలిశారు. ఈరోజు.. ఆయన ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లి నేరుగా కలిశారు. విష్ణు వర్దన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విష్ణు వర్దన్ రెడ్డి వర్గం నేతలకు కూడా బీఆర్ఎస్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు హరీష్ రావు.


ఓటుకు నోటు కేసు దొంగ చేతిలో కాంగ్రెస్‌ పార్టీ బందీ అయిందని అన్నారు మంత్రి హరీష్ రావు. డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని చెప్పారు. ఆ మాటల్లో నిజం లేకపోతే ప్యారాచూట్ నేతలకు అప్పటికప్పుడు కండువా కప్పి లిస్ట్ లో పేరెందుకు రాస్తారని అడిగారు. కాంగ్రెస్ పార్టీ చాలామంది సీనియర్లను మోసం చేసిందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్‌ కొన్ని ముఠాల చేతిలోకి వెళ్లిందని విష్ణు బాధపడ్డారని చెప్పారాయన. తెలంగాణ ఉద్యమంతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం నిలబడ్డ ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి అని ప్రశంసించారు హరీష్ రావు. విష్ణు, తాను అసెంబ్లీలో కలిసి పనిచేశామన్నారు. తెలంగాణ హక్కుల కోసం దివంగత పీజేఆర్‌ పనిచేశారనిని, ఆయన కార్మిక, పేదల నాయకుడని పేర్కొన్నారు. ఆ వారసత్వాన్ని విష్ణు కొనసాగిస్తున్నారని అన్నారు హరీష్ రావు.

ఈ పరిస్థితి ఊహించలేదు..

కాంగ్రెస్ ని తమ ఇంటి పార్టీగా భావిస్తూ వచ్చామని కానీ తనకు ఆ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు విష్ణువర్దన్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీ భవన్‌ ను కూడా అమ్మేసేవారు ఉన్నారని విమర్శించారు. త్వరలోనే తాను తన అనుచరులతో కలసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అభిమానులు, అనుచరుల సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

First Published:  30 Oct 2023 9:12 AM GMT
Next Story