Telugu Global
Telangana

నిమ్స్‌లో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ యంత్రాన్ని సమకూర్చుకున్నందుకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ రంగంలో నాలుగో జనరేషన్ రోబోటిక్ యంత్రం కలిగి ఉన్న మొట్టమొదటి ఆసుపత్రి నిమ్స్ అని మంత్రి చెప్పారు.

నిమ్స్‌లో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
X

అత్యాధునిక, అత్యంత ఖరీదైన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను నిమ్స్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సోమవారం నిమ్స్‌కు వెళ్లిన మంత్రి హరీశ్ రావు.. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించి, పరిశీలించారు. ఆ యంత్రం ద్వారా చేయనున్న సర్జరీలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నారు. ఎలాంటి ఆపరేషన్లు.. ఎలా నిర్వహిస్తారో మంత్రి హరీశ్ రావుకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ యంత్రాన్ని సమకూర్చుకున్నందుకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ రంగంలో నాలుగో జనరేషన్ రోబోటిక్ యంత్రం కలిగి ఉన్న మొట్టమొదటి ఆసుపత్రి నిమ్స్ అని మంత్రి చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించాలని అనేక అత్యాధునిక యంత్రాలను నిమ్స్‌కు ప్రభుత్వం అందిస్తున్నది. కొత్త ఎక్విప్‌మెంట్ కోసం సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పలు యంత్రాలు కొనుగోలు చేశాము. త్వరలోనే మిగిలిన ఎక్విప్‌మెంట్ కూడా వస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్‌కు విడుదల కావల్సిన ఆరోగ్యశ్రీ నిధులు కూడా వెంటన విడుదల చేయాలని సీఈవోను ఆదేశించారు.

నిమ్స్‌లో ఇంత ఖర్చు పెట్టి రోబోటిక్ యంత్రాన్ని కొనడంతో కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కంగారు పడుతున్నాయి. అంత ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులు యంత్రాలు కొనడం ఏంటని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు చాలా మంది కాల్స్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. రూ.32 కోట్లతో డావిన్సీ ఎక్స్ఐ రోబోటిక్ యంత్రం, రూ.10 కోట్లతో 150 డయాలసిస్ మెషిన్లు, ఎంఆర్ఐ మెషిన్, రూ.7 కోట్లతో నెక్స్‌జెన్ జినోమ్ సీక్వెన్సింగ్ మెషిన్, రూ.6 కోట్లతో న్యూరో నావిగేషన్ మెషిన్, రూ.5 కోట్లతో హెచ్‌డీఆర్ బ్రాకీ థెరపీ మెషిన్ కొనుగోలు చేశాము. రూ.5 కోట్లతో అనెస్థీషియా డిపార్ట్‌మెంట్‌ను బలోపేతం చేశాము. రూ.5 కోట్లతో మొబైల్ డీఎస్ఏ, రూ.4 కోట్లతో ప్రాక్చర్ ఫిక్సేషన్ సెట్లు, రూ.4 కోట్లతో పాథాలజీ స్కానర్, రూ.3 కోట్లతో ఆపరేటీవ్ మైక్రోస్కోప్ ఇలా అనేక అత్యాధునిక ఎక్విప్‌మెంట్లు అందించాము.

తెలంగాణ ఏర్పడ ముందు నిమ్స్ కంటే.. ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకప్పుడు నిమ్స్‌పై చిన్న చూపు ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రేపటితో టెండర్లు కూడా పూర్తవుతాయి. మరో వారం, 10 రోజుల్లో కొత్త నిమ్స్ బ్లాక్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. అది కూడా పూర్తయితే నిమ్స్‌లో 4వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు అది దేశంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఆసుపత్రిగా మారిపోతుందని మంత్రి చెప్పారు.

రాజకీయ నాయకులు ప్రభుత్వం నిమ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపణలు చేస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఆలిండియా ర్యాంకర్లు కూడా నిమ్స్‌లో చదవాలనే ఆసక్తితో ఉన్నారు. వారికి అవగాహనా లేమితోనే అలాంటి ఆరోపణలు చేస్తుంటారని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఫోకస్ చేసింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించాలనే నిమ్స్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు.

రోబోటిక్ యంత్రం వల్ల పేదలకు మంచి వైద్యం అందడమే కాకుండా.. డాక్టర్లకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని హరీశ్ రావు అన్నారు. తక్కువ సమయంలో, రక్తస్రావం లేకుండా సర్జరీలు నిర్వహించవచ్చు. దీంతో వైద్యులో రోజులో మరో రెండు ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుందని హరీశ్ రావు అన్నారు. నిమ్స్‌లో వైద్య సిబ్బందితో పాటు ఫ్యాకల్టీని కూడా భారీగా పెంచుతున్నది. ఎలాంటి ఖాళీలు లేకుండా నిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆరోగ్య తెలంగాణ సాధించడంలో వైద్యులు, ఇతర సిబ్బంది కృషి ఎంతో ఉన్నదని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వ రంగంలో 50వేల పడకలకు చేరుకుంటున్నాము. ఇక మెడికల్ కాలేజీలు కూడా భారీగా పెరగడంతో మెడికల్ సీట్లు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని హరీశ్ రావు చెప్పారు. హెల్త్ సెక్టార్‌లో మనం దేశంలో నెంబర్ 3లో ఉన్నాము. త్వరలోనే దేశంలోనే నెంబర్ 1గా మారాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్ రావు చెప్పారు.

First Published:  3 July 2023 12:22 PM GMT
Next Story