Telugu Global
Telangana

బీజేపీ వాళ్లను చీపురుకట్టలతో తరిమికొట్టాలి

గజ్వేల్ లో కేసీఆర్ కి పోటీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల పేరెత్తకుండానే.. పువ్వు గుర్తోడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు.

బీజేపీ వాళ్లను చీపురుకట్టలతో తరిమికొట్టాలి
X

నిత్యావసర వస్తువులపై సామాన్యుడు భరించలేనంతగా రేట్లు పెంచి ఇప్పుడు సిగ్గులేకుండా ఓట్ల కోసం వస్తున్న బీజేపీ వాళ్లను అక్కచెల్లెమ్మలు చీపురు కట్టలు పట్టుకొని తరిమి కొట్టాలన్నారు మంత్రి హరీష్ రావు. అప్పుడే వారికి సిగ్గు వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అందరూ వస్తుంటారు, పోతుంటారని, లేని పోనివి చెబుతుంటారని, ప్రజలే ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. ఓటు అంటే ఐదేళ్ల భవిత అని వివరించారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంత అభివృద్ది చెందిందో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు వేరే వాళ్లను తెచ్చుకుంటే.. కేసీఆర్ వేయించిన రోడ్లపై కనీసం డాంబర్ కూడా వేయలేరని చెప్పారు. గజ్వేల్ లో రోడ్ షో నిర్వహించిన మంత్రి హరీష్ రావు.. కేసీఆర్ కి ఇక్కడ భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు.


అంతా పువ్వుగుర్తోడి పనే..

400 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌ ను వెయ్యి రూపాయలు చేసింది పువ్వు గుర్తోడు, పాల మీద జీఎస్టీ వేసింది పువ్వు గుర్తోడు, బాయికాడ, బోరుకాడ మీటర్ పెట్టాలంటున్నది పువ్వు గుర్తోడు... ఇన్ని చేసిన పువ్వు గుర్తోడు.. ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓటు వేయాలని అడగడానికి వస్తున్నాడని మండిపడ్డారు హరీష్ రావు. చుక్క నీరు లేని గజ్వేల్‌కు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ అని.. ఆయన హయాంలో సాగు నీటి క‌ష్టాలు తీరి, రెండు పంటలు పండుతున్నాయని చెప్పారు. గజ్వేల్‌ ను కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు హరీష్ రావు.

గజ్వేల్ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు వస్తాయని, చీకటి కష్టాలు మొదలవుతాయని చెప్పారు. వంద అబద్ధాలు ఆడి గెలవాలని కాంగ్రెస్ వాళ్లు చూస్తున్నారని, నమ్మితే మోసపోతాం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. గజ్వేల్ లో కేసీఆర్ కి పోటీగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటల పేరెత్తకుండానే.. పువ్వు గుర్తోడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు.


First Published:  20 Nov 2023 12:36 PM GMT
Next Story