Telugu Global
Telangana

ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. వీళ్లు రూ.3వేలు ఇస్తారా? : మంత్రి హరీశ్ రావు

మునుగోడులో గెలిస్తే రూ. 3వేల పెన్షన్ ఇస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.. దమ్ముంటే ఆ హామీని తెలంగాణ అంతటా అమలు చేస్తామని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో చెప్పించాలని సవాలు విసిరారు.

ప్రధాని ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. వీళ్లు రూ.3వేలు ఇస్తారా? : మంత్రి హరీశ్ రావు
X

మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే భారీగా డబ్బును పంచిపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రచారంలో అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా బీజేపీ నాయకులు అనేక హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీ.. ఇప్పుడు కొత్తగా రూ. 3వేల ఫించను అనే రాగం ఎత్తుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల మాటలను మంత్రి హరీశ్ రావు ఎండగట్టారు. టీఆర్ఎస్ భవన్‌లో మాట్లాడిన ఆయన బీజేపీని జూటా, జుమ్లా పార్టీగా అభివర్ణించారు. దుబ్బాక, హుజారాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనేక హామీలు ఇచ్చిందని.. అందులో ఒకటైనా అమలైందా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

మునుగోడులో గెలిస్తే రూ. 3వేల పెన్షన్ ఇస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.. దమ్ముంటే ఆ హామీని తెలంగాణ అంతటా అమలు చేస్తామని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో చెప్పించాలని సవాలు విసిరారు. ఇప్పటికే ప్రధాని మోడీ మద్దతు ధరపై రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. రైతు చట్టాలను రద్దు చేసి జాతికి ప్రధాని క్షమాపణలు చెప్పి ఏడాది కావొస్తోంది. కానీ, మద్దతు ధరకు చట్టబద్దత తీసుకొస్తామని చెప్పిన హామీ ఇంత వరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ప్రధాని ఇచ్చిన హామీలకే ఇంత వరకు దిక్కులేదు కానీ.. మునుగోడులో బీజేపీ నేతలు మాత్రం కొత్తగా మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

Advertisement

మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ రహిత తాగునీటిని సరఫరా చేయకపోతే అది నో మ్యాన్ జోన్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిందని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న తన అన్న వెంకటరెడ్డి ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేక పోయారని మంత్రి ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా కేంద్రం ఒక్క పైసా సాయం చేయలేదని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తోందని హరీశ్ అన్నారు.

తెలంగాణ ఏర్పాటును ఏకంగా ప్రధానే కించపరుస్తూ మాట్లాడారని.. తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చారని ఆయన వ్యాఖ్యానించారని హరీశ్ రావు గుర్తు చేశారు. నల్లగొండకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వలేని బీజేపీకి మునుగోడులో ఓట్లడిగే హక్కు లేదన్నారు. 8 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోవడంతో నల్గొండ, మునుగోడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కోర్టులో కేసు ఉపసంహరించకుంటే వాటా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మేం కేసు ఉపసంహరించుకొని 10 నెలలు గడిచినా ఇంత వరకు కేటాయింపులు చేయలేదని చెప్పారు.

ఫ్లోరోసిస్‌ను మునుగోడు నుంచి పారదోలింది సీఎం కేసీఆర్ కాదా అని మంత్రి ప్రశ్నించారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే సూర్యాపేట, నల్గొండలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మునుగోడు ఓటర్లు బీజేపీ మాయమాటలకు పడిపోవద్దని.. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Next Story